
తొలి టెస్టు తొలి రోజే ఇండియాపై పూర్తి ఆధిక్యం కనబర్చిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్... మూడోరోజు వరకూ బ్యాటింగ్ కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో పదోసారి 150+ స్కోరు చేసి, డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు.
వందో టెస్టులో ఇంజమామ్ వుల్ హక్ తర్వాత 150+ స్కోరు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన జో రూట్... వరుసగా 98, 99, 100వ టెస్టుల్లో సెంచరీ బాదిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.... వంద టెస్టుల్లో 69 సార్లు 50+ స్కోర్లు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గానూ రికార్డు క్రియేట్ చేసిన ఇంగ్లీష్ టెస్టు కెప్టెన్, మూడో రోజు వరకూ బ్యాటింగ్ చేసి, భారత జట్టును చికాకు పెడతానని ప్రకటించాడు.
‘పిచ్ బ్యాటింగ్‌కి చక్కగా సహకరిస్తోంది. మూడో రోజు వరకూ బ్యాటింగ్ చేసి, తొలి ఇన్నింగ్స్‌లో 600-700 స్కోరు చేయాలని చూస్తాం. కాళ్లు తిమ్మిరిపెట్టినప్పుడు విరాట్ కోహ్లీ క్రీడా స్ఫూర్తితో సాయం చేయడం నిజంగా గొప్ప విషయం...’ అంటూ చెప్పుకొచ్చాడు జో రూట్.