వాళ్ల వల్లే నేను కెప్టెన్సీ కోల్పోయా.. నా మీద పగబట్టి మరీ దానిని దూరం చేశారు : యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

By Srinivas MFirst Published May 8, 2022, 1:36 PM IST
Highlights

Yuvraj Singh Comments on Captaincy: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ జట్టులో ధోని కంటే సీనియర్. అయితే  యువీని కాదని ధోనికి కెప్టెన్సీ కట్టబెట్టడంపై అతడు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 

భారత జట్టుకు రెండు  ప్రపంచకప్పులు (2007లో టీ20, 2011 లో వన్డే ప్రపంచకప్) అందించడంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.. తన కన్నా  తర్వాత వచ్చిన  మహేంద్ర సింగ్ ధోనికి  టీమిండియా సారథ్యం ఇవ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  అసలైతే.. ధోని కంటే ముందు కెప్టెన్ గా తన పేరే పరిగణనలోకి వచ్చిందని, కానీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) లోని పలువురు కుట్ర పన్ని దానిని తనకు దక్కకుండా  చేశారని  చెప్పుకొచ్చాడు. ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  యువీ ఈ కామెంట్స్ చేశాడు. 

యువీ వ్యాఖ్యలు అతడి మాటల్లోనే.. ‘2007లో నేను కెప్టెన్ కావాల్సింది. కానీ అప్పుడే జరిగిన గ్రెగ్ ఛాపెల్ (టీమిండియా మాజీ హెడ్ కోచ్ 2005-2007) ఉదంతం నన్ను కెప్టెన్సీ నుంచి దూరం చేసింది.  ఆ విషయంలో చాపెలా లేక సచినా..? అనే పరిస్థితి ఎదురైనప్పుడు నేను సచిన్ వైపే నిలబడ్డాను.. 

Latest Videos

అయితే ఆ సమయంలో బీసీసీఐ లో చాలా మందికి నా నిర్ణయం నచ్చలేదు.  అప్పుడు నేను కెప్టెన్సీ రేసులో ఉన్నా  నన్ను తప్ప ఎవరిని సారథిగా చేసినా ఓకేనని వాళ్లు చెప్పారని నాకు తర్వాత తెలిసింది. ఇందులో నిజమెంతో నాకు తెలియదు. కానీ బోర్డులోని కొందరు సభ్యులు నామీద పగబట్టారు. 2007 ఇంగ్లాండ్ టూర్ కు   నాకంటే సీనియర్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ అందుబాటులో లేడు. దాంతో వన్డేలకు రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ కాగా నేను వైస్ కెప్టెన్ గా ఉన్నా.. 

ఆ సమయంలోనే టీ20 ప్రపంచకప్ కోసం జట్టు ఎంపిక, సారథి గురించి వెతుకుతున్న టీమిండియా యాజమాన్యం.. నన్ను టీ20 జట్టుకు కెప్టెన్ గా చేస్తుందని  అనిపించింది. సీనియారిటీ ప్రకారం చూసినా నేను కెప్టెన్ అవ్వాల్సింది. కానీ నన్ను వైస్ కెప్టెన్ గా తొలగించారు. అయితే మేనేజ్మెంట్  మద్దతు మాత్రం ధోనికి ఉంది. దాంతో  మహీ భాయ్ కెప్టెన్ అవడం.. టైటిల్ గెలవడం.. అన్నీ ఓ కలలా జరిగిపోయాయి. అయితే కెప్టెన్సీ రాకపోయినందుకు నాకేం బాధగా లేదు..’ అని యువీ తెలిపాడు. 

2005 నుంచి 2007 దాకా టీమిండియాకు హెడ్ కోచ్ గా పనిచేసిన  గ్రెగ్ ఛాపెల్ భారత జట్టును ఆగమాగం చేశాడు. ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.  ఓపెనర్ గా  ప్రపంచంలోనే ఎవరికీ లేని రికార్డు  ఉన్న సచిన్ ను రెండో స్థానంలో బ్యాటింగ్ కు పంపడం.. కెప్టెన్ గంగూలీతో విభేదాలు.. 2007 వన్డే ప్రపంచకప్ లో టీమిండియా ఘోర వైఫల్యానికి  కారణమవడం.. ఈ విషయాల్లో ఛాపెల్  పాత్ర ఎంతో ఉంది.  కానీ ఆయన హెడ్ కోచ్ గా తప్పుకున్నాక  టీమిండియా మళ్లీ గాడిన పడింది.

click me!