
ఐపీఎల్ 2022 సీజన్‌లో టైటిల్ ఫెవరెట్స్‌గా బరిలో దిగిన ఒక్కో జట్టు వరుసగా ప్లేఆఫ్స్ రేసు నుంచి మెల్లిమెల్లిగా తప్పుకుంటున్నాయి. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకోగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ది కూడా దాదాపు అదే పరిస్థితి. ఇప్పుడు ఈ లిస్టులోకి కేకేఆర్ కూడా వచ్చి చేరింది...
ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 75 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది కేకేఆర్.. సీజన్‌లో 8వ విజయాన్ని అందుకున్న లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తర్వాత ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది...
177 పరుగుల లక్ష్యఛేదనలో కేకేఆర్‌కి ఏదీ కలిసి రాలేదు. మోహ్సిన్ ఖాన్ వేసిన తొలి ఓవర్‌లో 6 బంతులాడిన బాబా అపరాజిత్, ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. సున్నా పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది కేకేఆర్. 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, ఛమీరా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
14 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్, హోల్డర్ బౌలింగ్‌లో, 11 బంతులాడి 2 పరుగులు మాత్రమే చేసిన నితీశ్ రాణా.. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. దీంతో 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది కేకేఆర్...
10 బంతులాడి 6 పరుగులు చేసిన రింకూ సింగ్, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో అవుట్ కాగా 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 45 పరుగులు చేసిన ఆండ్రే రస్సెల్‌ను ఆవేశ్ ఖాన్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రెండో బంతికే అనుకూల్ రాయ్ డకౌట్ కావడంతో 85 పరుగుల వద్ద 7వ వికెట్ కోల్పోయింది కోల్‌కత్తా...
12 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన సునీల్ నరైన్, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో కేకేఆర్ ఓటమి ఖరారైపోయింది... టిమ్ సౌథీ గోల్డెన్ డకౌట్ కాగా హర్షిత్ రాణా రనౌట్ కావడంతో 14.3 ఓవర్లలో 101 పరుగులకి ఆలౌట్ అయ్యింది కేకేఆర్...
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది... మొదటి ఓవర్‌లోనే కెఎల్ రాహుల్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే డైమండ్ డకౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. కేకేఆర్ కెప్టెన్ సూపర్ త్రోకి లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ డైమండ్ డకౌట్ అయ్యాడు.
ఒకే సీజన్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన కెప్టెన్‌గా రెండో స్థానంలో నిలిచాడు కెఎల్ రాహుల్... ఇంతకుముందు 2012లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్భజన్ సింగ్, 2014లో కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్, 2014లో ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, 2018లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్, 2018లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒకే సీజన్‌లో మూడు సార్లు డకౌట్ అయ్యారు...
2013 నుంచి 2021 వరకూ ఐపీఎల్ ఒకే ఒక్క డకౌట్ అయిన కెఎల్ రాహుల్, ఈ సీజన్‌లో ఏకంగా మూడు సార్లు డకౌట్ కావడం విశేషం. 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయినా క్వింటన్ డి కాక్, దీపక్ హుడా కలిసి రెండో వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి లక్నోని ఆదుకున్నారు.
29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, సునీల్ నరైన్ బౌలింగ్‌లో శివమ్ మావికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసిన దీపక్ హుడా.. ఆండ్రే రస్సెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
27 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా కూడా రస్సెల్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. 13 ఓవర్లలోనే 110 పరుగులు చేసిన లక్నో సూపర్ జెయింట్స్, ఆ తర్వాత స్కోరు వేగాన్ని తగ్గించింది. 18 ఓవర్లు ముగిసే సమయానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది...
అయితే 19వ ఓవర్‌లో వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన మార్కస్ స్టోయినిస్, ఆ తర్వాతి బంతికి అవుట్ అయ్యాడు. 14 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు స్టోయినిస్. వస్తూనే జాసన్ హోల్డర్ రెండు సిక్సర్లు బాదడంతో ఆ ఓవర్‌లో 30 పరుగులు వచ్చాయి...