
ఐపీఎల్-15 లో అన్ని విభాగాల్లోనూ సమిష్టిగా రాణిస్తూ ప్లేఆఫ్స్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచిన రాజస్తాన్ రాయల్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టులో కీలక ఆటగాడు, స్టార్ హిట్టర్ వెస్టిండీస్ కు చెందిన షిమ్రన్ హెట్మెయర్.. ఆదివారం రాజస్తాన్ ను వీడాడు. పంజాబ్ తో మ్యాచ్ అనంతరం అతడు రాజస్తాన్ క్యాంప్ నుంచి వెళ్లిపోయాడు. హెట్మెయర్ తండ్రి కాబోతున్నాడు. అతడి భార్య నిర్వాణి ఆదివారం తొలి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ నేపథ్యంలో తన భార్యతో ఉండాలని.. ప్రత్యేక అనుమతితో అతడు జట్టును వీడాడు.
మే 8 (ఆదివారం) నిర్వాణి డెలివరీ డేట్ ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హెట్మెయర్.. మొదటి బిడ్డ ఏ తల్లిదండ్రులకైనా ప్రత్యేకం అని చెప్పడంతో రాజస్తాన్ యాజమాన్యం కూడా అతడి విన్నపాన్ని మన్నించింది. దీంతో అతడు శనివారం రాత్రి పంజాబ్ తో మ్యాచ్ ముగిసిన వెంటనే రాజస్తాన్ క్యాంప్ ను వీడి తన స్వస్థలం గయానా (వెస్టిండీస్) కు బయల్దేరాడు.
ఈ విషయాన్ని రాజస్తాన్ రాయల్స్ తన ట్విటర్ ఖాతాలో హెట్మెయర్ వెళ్తున్న వీడియోను పంచుకుంది. ‘తండ్రిగా ప్రమోట్ కాబోతున్న హెట్మెయర్ తన స్వస్థలం గయానా వెళ్తున్నాడు. అతడు తిరిగి కొద్దిరోజుల్లోనే జట్టుతో కలుస్తాడు’ అని రాసుకొచ్చింది.వీడియోలో హెట్మెయర్.. రాజస్తాన్ ఆటగాళ్లను ఆలింగనం చేసుకుని ‘నేను లేనని బాధపడకండి. మళ్లీ వస్తా.. నేనెక్కడున్న నా జ్ఞాపకాలు మీతోనే ఉంటాయి’ అని చెప్పాడు.
శనివారం రాత్రి గయానా వెళ్లిన హెట్మెయర్.. వారం రోజుల్లో తిరిగి ఇండియాకు రానున్నాడు. అయితే వచ్చిన తర్వాత తిరిగి ఐపీఎల్ నిబంధనల ప్రకారం అతడు 3 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే. అయితే ఇప్పటికే 7 విజయాలతో ప్లేఆఫ్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకున్న రాజస్తాన్.. తర్వాత ఆడబోయే 3 మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా చాలు. అయితే ఈ మూడు మ్యాచులకు మాత్రం హెట్మెయర్ అందుబాటులో ఉండడు. ప్లేఆఫ్స్ సమయానికల్లా అతడు జట్టుతో చేరే అవకాశమున్నట్టు రాజస్తాన్ రాయల్స్ వర్గాలు తెలిపాయి.
ఇక శనివారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు నిర్దేశించిన 190 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్తాన్ మరో రెండు బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఆ జట్టులో యశస్వి జైస్వాల్.. 68 పరుగులతో రాణించగా ఆఖర్లో 16 బంతుల్లోనే 31 పరుగులతో విజయాన్ని హెట్మెయర్ ఖాయం చేశాడు. ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు 11 మ్యాచులాడిన అతడు... 291 పరుగులు చేశాడు. ఆఖర్లో వచ్చి ధనాధన్ ఆటతో రాజస్తాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.