
మహిళల ప్రీమియర్ లీగ్ లో భారీ అంచనాలతో అడుగుపెట్టి దారుణమైన ప్రదర్శనలతో వరుసగా నాలుగో మ్యాచ్ లలో ఓడి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నది ఆర్సీబీ. జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ మ్యాచ్ లు ఓడుతుండటం ఆ జట్టు మేనేజ్మెంట్ తో పాటు అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తున్నది. తాజాగా శుక్రవారం రాత్రి యూపీ వారియర్స్ తో మ్యాచ్ లో కూడా ఆ జట్టు ఓడటంతో మంధాన అండ్ కో. పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మంధాన స్పందించింది. ఓటములకు పూర్తి బాధ్యత తనదే అని తెలిపింది.
యూపీ వారియర్స్ తో మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన మంధాన.. ‘గత నాలుగు మ్యాచ్ ల నుంచి ఇదే (ఓటమి) జరుగుతోంది. మేము మ్యాచ్ లను బాగానే ఆరంభిస్తున్నాం కానీ వాటిని తుది వరకూ కంటిన్యూ చేయలేకపోతున్నాం..
మా బౌలర్లు స్కోరును కాపాడుకోవాలంటే అందుకు అనుగుణంగా బ్యాటర్లు కూడా స్కోరు బోర్డుపై సరిపడినన్ని పరుగులు సాధించాలి. కానీ అలా జరగడం లేదు. ఈ ఓటములకు పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నా. ముఖ్యంగా మేం బ్యాటింగ్ చేసేప్పుడు 7-15 ఓవర్ల మధ్య తడబడుతున్నాం. మిడిల్ ఓవర్స్ లో పరుగులు చేయలేకపోతున్నాం. దీని మీద మేం దృష్టి సారించాలి. ఇవాళ మాకు ఏదీ అనుకూలంగా లేదు. తదుపరి మ్యాచ్ లలో అయినా మా లోపాలను సరిదిద్దుకుని మెరుగైన ప్రదర్శనలు చేస్తాం...’అని తెలిపింది.
అంతేగాక గత వారం రోజులుగా తమ జట్టుకు చాలా కష్టంగా గడిచిందని, తాము ఎక్కడ బలహీనంగా ఉన్నామో ఆ ఏరియాలలో మెరుగపడాల్సిన అవసరం కూడా ఉందని మంధాన చెప్పింది. ‘నేను ఈ ఓటముల గురించి టీమ్ లో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నా. గత వారం చాలా కఠినంగా గడిచింది. చాలా మంది నాకు మెసేజ్ ల ద్వారా , ఫోన్స్ లలో మద్దతు ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెటర్లుగా మాకు ఇదేం కొత్త కాదు. కానీ నా కుటుంబం నుంచి నాకు మద్దతు ఉంటుంది. వాళ్లు ఎల్లప్పుడూ నాకు సహకరిస్తారు..’అని వివరించింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే శుక్రవారం బ్రబోర్న్ స్టేడియం వేదికగా ముగిసిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 138 పరుగులకే పరిమితమైంది. ఎలీస్ పెర్రీ (52), సోఫీ డివైన్ (36) మినహా మిగిలినవారంతా అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. కెప్టెన్ స్మృతి మంధాన (4), కనిక అహుజా (8), హెదర్ నైట్ (2), శ్రేయాంక పాటిల్ (15), ఎరిన్ బర్న్స్ (12), రిచా ఘోష్ (1) లు అలా వచ్చి ఇలా వెళ్లారు. యూపీ బౌలర్లలో ఎక్లిస్టోన్ నాలుగు వికెట్లు తీయగా దీప్తి శర్మకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యాన్ని యూపీ 13 ఓవర్లలోనే ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్లు కెప్టెన్ అలీస్సా హీలి (47 బంతుల్లో 96 నాటౌట్, 18 ఫోర్లు, 1 సిక్స్) , దేవికా వైద్య (31 బంతుల్లో 36 నాటౌట్, 5 ఫోర్లు) లు ధాటిగా ఆడి యూపీకి ఘన విజయాన్ని అందించారు.