
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న (స్మృతి మంధాన) ప్లేయర్ ఉంది. మహిళల క్రికెట్ లో దిగ్గజాలుగా వెలుగొందుతున్న (ఎలీస్ పెర్రీ, హెదర్ నైట్) విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ప్రపంచ స్థాయి బౌలర్ల (మేగన్ షుట్, రేణుకా సింగ్ ఠాకూర్) కు కొదవలేదు. ఆల్ రౌండర్లూ ఉన్నారు. పరిస్థితులకు తగ్గట్టు రెచ్చిపోయే యువ ఆటగాళ్ల (రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్) కూ కొదవ లేదు. అభిమానుల మద్దతు లెక్కలేనంత ఉంది. ఫ్రాంచైజీకి క్రేజ్ కావాల్సినంత ఉంది. ఇన్ని వనరులు ఉన్న జట్టు ఎలా ఆడాలి..? బరిలోకి దిగితే రికార్డులు బద్దలవ్వాలి. కానీ అలా జరగడం లేదు. ఎందుకంటే అది ఆర్సీబీ.
పురుషులు పోటీ పడే ఐపీఎల్ లో ఇప్పటివరకు 15 సీజన్లు ముగిసినా ఒక్కటంటే ఒక్క టైటిల్ నెగ్గని జట్లలో ఆర్సీబీ ఒకటి. జట్టు నిండా సూపర్ స్టార్లు, ఇంటర్నేషనల్ ప్లేయర్లు ఉన్నా ఆ జట్టు ఇంతవరకూ ఒక్క ఐపీఎల్ ట్రోఫీ నెగ్గలేదు. ప్రతీ సీజన్ కు ‘ఈ సాలా కప్ నమ్దే’ అనడం.. ప్లేఆఫ్స్ లోనో అదీ వీలుకాకుంటే లీగ్ దశలోనే వెనుదిరగడం ఆ జట్టుకు వెన్నతో పెట్టిన విద్య.
మహిళలదీ అదే కథ..
సరే, పురుషుల జట్టు అంటే అదృష్టం బాగోలేదనుకుంటే మహిళలైనా తమ ట్రోఫీ ఆశలు తీస్తారని అభిమానులు కోట్లాది ఆశలు పెట్టుకున్నారు. జట్టు ప్రకటన, ఆటగాళ్లను తీసుకున్న తర్వాత టీమ్ ను చూసి ‘మెన్స్ సాధించకపోతే పోయారు. కానీ ఉమెన్స్ టీమ్ సాలిడ్ గా ఉంది. ఈ సాలా కప్ నమ్దే..’ అనుకున్నారు. కానీ ఫలితం మాత్రం మారలేదు. మహిళా మణులు ఆడిన నాలుగు మ్యాచ్ లలోనూ ఓటములే వెక్కరించాయి.
ఒక్కరంటే ఒక్కరైనా..
ఆర్సీబీ తన ట్విటర్ ఖాతాలో ‘ప్లే బోల్డ్’ అనే టాగ్ లైన్ తో నానా హంగామా చేస్తుంది. వాళ్ల క్యాప్షన్ లో ఉన్నంత సత్తా ఆటగాళ్లలో మాత్రం కనిపించడం లేదు. మంధాన వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఆశించిన స్థాయిలో రాణించలేదు. ప్రపంచ స్థాయి ఆల్ రౌండర్లైన పెర్రీ, నైట్ లు విఫలమవుతున్నారు. రిచా ఘోష్ తన మార్కును చూపించలేకపోతోంది. మేగన్ షుట్, రేణుకా సింగ్ బౌలింగ్ లో అట్టర్ ఫ్లాఫ్. సమయానికి ఆదుకునే బ్యాటర్లు లేక ఆర్సీబీ విలవిల్లాడుతోంది. యువ ప్లేయర్లు కాస్తో కూస్తో మెరుస్తున్నా అవి విజయాలు అందించే ప్రదర్శనలైతే కావు.
నెటిజన్ల ఆగ్రహం..
ఆర్సీబీపై భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులు వాళ్ల ఆటను చూసి ఏమనాలో తెలియక.. ఇతర జట్ల అభిమానులకు ఎలా బదులివ్వాలో అర్థం కాక ఆర్సీబీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ఈ ఆట ఆడి బాధ పెట్టేకంటే హోలీ ఆడుకుంటూ ఆ ఫోటోలైనా నెట్లో షేర్ చేస్తే తాము వాటిని చూసైనా ఎంజాయ్ చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్సీబీ ఇటీవల హోలీ సందర్భంగా నానా హంగామా చేసిన తెలిసిందే. అంతేగాక వాళ్ల ఆట చూశాక స్వయంగా ఆర్సీబీ అభిమానులే సోషల్ మీడియా వేదికగా మీమ్స్ తో ఆ జట్టును ట్రోల్ చేస్తున్నారు. కొంతమందేమో ఆర్సీబీ ఓటములకు సానియా మీర్జాను టార్గెట్ చేస్తూ.. ‘టెన్నిస్ ప్లేయర్ ను మెంటార్ గా పెట్టుకుని గెలవమంటే ఎలా గెలుస్తారు..?’అంటూ నెపమంత ఆమెమీదకు నెడుతున్నారు.