
ఇటీవలి కాలంలో భారత్ క్రికెట్ ఆట కంటే ఆఫ్ ది ఫీల్డ్ విషయాల మీద ఎక్కువ వార్తల్లో ఉంటుంది. ఏ క్షణాన విరాట్ కోహ్లి టీ20 బాధ్యతల నుంచి వైదొలిగాడో గానీ అప్పట్నుంచి రోజూ ఏదో వార్త. బీసీసీఐ-విరాట్ కోహ్లి-రోహిత్ శర్మ-సౌరవ్ గంగూలీ.. ఇలా ప్రతిరోజూ ఎవరో ఒకరు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గంగూలీ-కోహ్లి ల మధ్య తలెత్తిన విభేదాలైతే రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల మీడియాలో భాగా ప్రసారమైన వార్త.. ‘గంగూలీ.. జట్టు సెలెక్షన్ కమిటీలో తల దూరుస్తున్నాడు’ అని.
దీనిపై బీసీసీఐ కూడా రెండు వర్గాలుగా చీలినట్టు వార్తలు వచ్చాయి. గంగూలీ మీద వచ్చినవన్నీ అర్థంలేని ఆరోపణలని బీసీసీఐ లోని దాదా అనుకూల వర్గం చెప్పగా.. లేదు అవి నిజమేనని అతడి వ్యతిరేక వర్గం విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో స్వయంగా బీసీసీఐ అధ్యక్షుడే ఈ ఆరోపణలపై స్పందించాడు.
ఓ జాతీయ ఛానెల్ తో గంగూలీ మాట్లాడుతూ... ‘ఈ విషయం (గంగూలీ సెలెక్షన్ కమిటీలో తలదూర్చడం గురించి) లో నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నిరాధార ఆరోపణలు. నేను బీసీసీఐ అధ్యక్షుడిని. బీసీసీఐ ప్రెసిడెంట్ ఏం చేయాలో నేనూ అదే చేస్తున్నా. ఈ ఆరోపణలకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ చిత్రా (గంగూలీ, జైషా, విరాట్ కోహ్లి, జాయింట్ సెక్రెటరీ జయేష్ జార్జ్ తో కూడిన ఫోటో)న్ని నేను కూడా చూశాను...
అది సెలెక్షన్ కమిటీ లో నేను జాయిన్ అయిన మీటింగ్ గా ప్రచారం జరుగుతున్నది. ఆ ఫోటో అందుకు సంబంధించింది కాదు. జయేష్ జార్జ్ సెలెక్షన్ కమిటీ సమావేశాల్లో భాగం కాదు. నేను భారత్ తరఫున 424 మ్యాచులు ఆడిన వ్యక్తిని. నిబంధనలు నాకు తెలియవా..? అవి తెలియకుండానే ఇక్కడ కూర్చున్నానా..?’ అంటూ గంగూలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
జై షాతో మంచి అనుబంధం ఉంది...
బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షాతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని గంగూలీ అన్నాడు. అతడు నమ్మదగ్గ సహచరుడని తెలిపాడు. ‘నేను, జై షా, అరున్ ధుమాల్, జయేష్ జార్జ్ అంతా కలిసి జట్టుగా పనిచేస్తున్నాం. ముఖ్యంగా గత రెండేండ్లుగా మేమంతా బాగా పనిచేశాం కాబట్టే ఇన్ని విజయవంతమైన టోర్నీలు సాకారమయ్యాయి..’ అని చెప్పాడు.