
దక్షిణాఫ్రికా యువ సంచలనం, ఆ జట్టు అభిమానులు జూనియర్ ఏబీ డివిలియర్స్ గా పిలుచుకుంటున్న డేవాల్డ్ బ్రెవిస్ అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ లో భాగంగా అతడు.. టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా.. సింగిల్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఇన్నాళ్లు ధావన్ పేరిట ఉన్న రికార్డును బ్రెవిస్ బ్రేక్ చేశాడు. ధావన్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్ లో భాగంగా గురువారం (ఫిబ్రవరి3)న జరిగిన ప్లే ఆఫ్ (ఏడో స్థానం) కోసం జరిగిన మ్యాచులో శతకం బాదిన బ్రెవిస్ ఈ ఘనతను సాధించాడు.
ప్రపంచకప్ టోర్నీలో సింగిల్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇన్నాళ్లు ధావన్ (505 పరుగులు) అగ్రస్థానంలో ఉండేవాడు. కానీ బ్రెవిస్ ఇప్పుడు ధావన్ ను అధిగమించాడు. బంగ్లాదేశ్ తో ముగిసిన మ్యాచులో అతడు సెంచరీ (130 బంతుల్లో 138) చేయడంతో ఈ టోర్నీలో 506 పరుగులు చేశాడు. అతడి సగటు 84.33 గా ఉండటం గమనార్హం.
ఒకే ఒక్క పరుగుతో ధావన్ రెండో స్థానానికి దిగజారాడు. 2004 అండర్-19 ప్రపంచకప్ సందర్భంగా ధావన్ 505 పరుగులు సాధించాడు. ఇక ఈ జాబితాలో ధావన్ తర్వాత బ్రెట్ విలియమ్స్ (ఆస్ట్రేలియా- 471 పరుగులు), కామెరూన్ వైట్ (ఆస్ట్రేలియా-423 పరుగులు) డెన్వోన్ పగాన్ (వెస్టిండీస్- 421 పరుగులు) ఉన్నారు.
జూనియర్ ప్రపంచకప్ లో ఆరు మ్యాచులు ఆడిన బ్రెవిస్.. రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. సగటు 84.33గా ఉండగా.. ఈ టోర్నీలో అతడు కొట్టిన ఫోర్ల సంఖ్య 45. సిక్సర్ల సంఖ్య 18గా ఉంది. దీనిని బట్టి చూస్తే బౌలర్లపై బ్రెవిస్ ఆధిపత్యం ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.కాగా.. ఈ టోర్నీ ఆసాంతం రాణించిన బ్రెవిస్ ఈసారి ఐపీఎల్ వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు. తన ఆటతీరుతో డివిలియర్స్ ను మరిపిస్తున్న బ్రెవిస్ ను దక్షిణాఫ్రికా ఫ్యాన్స్.. జూనియర్ ఏబీడీ, ఏబీడీ 2.0 వంటి పేర్లతో అతడిని అభిమానులు పిలుస్తున్నారు. డివిలియర్స్ మాదిరే గ్రౌండ్ నలువైపులా షాట్లు ఆడటంలో బ్రెవిస్ దిట్ట.
బ్రెవిస్ ను దక్కించుకోవడానికి పలు ఫ్రాంచైజీలు పోటీ పడతాయనడంలో సందేహం లేదు. ఇటీవలే బ్రెవిస్ ఐపీఎల్ గురించి వ్యాఖ్యానిస్తూ.. తనకు విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ అంటే ఎంతో ఇష్టమని.. ఆ ఇద్దరూ ప్రాతినిథ్యం వహించే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాలని ఉందని తెలిపిన విషయం తెలిసిందే.