
మహేంద్ర సింగ్ ధోనీకి అత్యంత ఆప్తుడిగా గుర్తింపు తెచ్చుకున్న ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా, 2020 ఆగస్టు 15న రిటైర్మెంట్ తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ధోనీ ప్రకటించగానే, ‘నీ వెనకే నేను’ అంటూ సురేష్ రైనా కూడా రిటైర్మెంట్ ఇచ్చేశాడు...
మహేంద్ర సింగ్ ధోనీ వంటి లెజెండరీ క్రికెటర్ రిటైర్మెంట్ హడావుడిలో సురేష్ రైనా రిటైర్మెంట్ విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత దేశవాళీ టోర్నీల్లో ఆడుతూ వచ్చిన సురేష్ రైనా, ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో అమ్ముడుపోలేదు...
చెన్నై సూపర్ కింగ్స్‌కి మూడు టైటిల్స్ అందించిన రైనా, సీఎస్‌కే బేస్ ప్రైజ్‌కి కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 టోర్నీలో ఆడుతున్న సురేష్ రైనా.. వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 41 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు..
ఈ ఇన్నింగ్స్ తర్వాత మీడియాతో మాట్లాడిన సురేష్ రైనాకి, రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకునే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి తన స్టైల్‌లో సమాధానం ఇచ్చాడు సురేష్ రైనా...
‘నేను సురేష్ రైనాని, షాహిద్ ఆఫ్రిదీని కాదు. రిటైర్మెంట్ ఇచ్చేశాను.. ఇక అంతే’ అంటూ కామెంట్ చేశాడు మిస్టర్ ఐపీఎల్...
వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్భజన్ సింగ్‌తో కలిసి గ్రౌండ్‌లోనే ‘నాటు-నాటు’ స్టెప్పులు వేశాడు సురేష్ రైనా. గంభీర్ రెస్ట్ తీసుకోవడంతో ఇండియా మహారాజాస్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన హర్భజన్ సింగ్, ఆరోన్ ఫించ్‌ని అవుట్ చేశాడు. ఈ వికెట్ పడిన తర్వాత రైనా భుజంపై చెయ్యి వేసి, ‘నాటు నాటు’ స్టెప్పులతో అదరగొట్టాడు హర్భజన్ సింగ్.
వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఓడిన ఇండియా మహారాజాస్.. ఈ సీజన్‌లో మూడో ఓటమిని మూటకట్టుకుంది. మన్విందర్ బిస్లా 36, ఇర్ఫాన్ పఠాన్ 25 పరుగులు చేసినా మిగిలిన ప్లేయర్లు అంతా ఫెయిల్ అయ్యాడు. దీంతో ఇండియా మహారాజాస్ 136 పరుగులే చేయగలిగింది. క్రిస్ గేల్ 57, షేన్ వాట్సన్ 26 పరుగులతో రాణించి వరల్డ్ జెయింట్స్‌కి మూడో విజయాన్ని అందించారు..
పాక్ మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్, కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ... ఏకంగా ఐదు సార్లు రిటైర్మెంట్ ఇవ్వడం విశేషం. 2011లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు మొదటిసారి ప్రకటించాడు ఆఫ్రిదీ. అయితే పాక్ వరుస ఓటములు ఎదుర్కోవడంతో మళ్లీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడు. ఇలా నాలుగు సార్లు రిటైర్మెంట్ ఇవ్వడం, తాను లేకపోతే టీమ్ ఓడిపోతుందనే ఉద్దేశంతో మళ్లీ వెనక్కి రావడం... ఇలా ఆనవాయితీ కొనసాగింది..
2016లో పీసీబీ స్వయంగా ఇక షాహిద్ ఆఫ్రిదీ రిటైర్ అవ్వాలని మీడియాతో ప్రకటించడంతో 2017 ఫిబ్రవరిలో రిటైర్మెంట్ ప్రకటించాడు.. దీంతో ఎప్పుడు ఏ క్రికెటర్ రిటైర్మెంట్ గురించి చర్చ జరిగినా షాహిద్ ఆఫ్రిదీ రిటైర్మెంట్ గురించి టాపిక్ వస్తుంటుంది.