
వరుసగా రెండు టెస్టులలో ఓటములతో పాటు కీలక ఆటగాళ్లు దూరమై ఢీలా పడిపోయిన ప్రపంచ నెంబర్ వన్ టెస్టు జట్టు ఆస్ట్రేలియాకు శుభవార్త. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ మూడో టెస్టు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే స్పష్టం చేశాడు. తాను వేలి గాయం నుంచి కోలుకున్నానని గ్రీన్ చెప్పాడు. మార్చి 1 నుంచి మొదలుకాబోయే ఇండోర్ టెస్టు కోసం తాను వంద శాతం ఫిట్ గా ఉన్నానని తెలిపాడు.
ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్.కామ్.ఏయూతో గ్రీన్ మాట్లాడుతూ.. ‘వాస్తవానికి నేను రెండో టెస్టు ముందు నా గాయం నుంచి దాదాపుగా కోలుకున్నాను. కానీ మరో వారం ఆగితే మంచిదని వైద్యులు సూచించారు. ఇక ఇప్పుడు టెస్టు ముగిశాక మంచి విరామం దొరికింది. ఇప్పుడు నేను పూర్తి ఫిట్ గా ఉన్నా...
ప్రాక్టీస్ లో కూడా బ్యాటింగ్ చేసేప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది అనిపించడం లేదు. స్వీప్ షాట్స్ కూడా బాగా ఆడుతున్నాను. నాలుగైదు రోజుల క్రితం వేలు కాస్త నొప్పి ఉన్నా ఇప్పుడు అది కూడా లేదు. గత రెండు వారాలుగా నేను వంద శాతం ఫిట్ గా ఉన్నానని చెప్పగలను. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా బాగా చేయగలుగుతున్నాను. కొద్దిరోజుల క్రితం బంతిని వేళ్ల మధ్యలో తిప్పేప్పుడు కాస్త నొప్పిగా ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇండోర్ టెస్టులో ఆడేందుకు ఎదురుచూస్తున్నా..’అని చెప్పాడు.
ఆస్ట్రేలియా తరఫున ఇప్పటివరకు 18 టెస్టులు ఆడిన గ్రీన్.. 806 పరుగులు చేశాడు. బౌలర్ గా 23 వికెట్లు పడగొట్టాడు. ఆనతి కాలంలోనే ఆస్ట్రేలియాకు నమ్మదగ్గ ఆల్ రౌండర్ గా ఎదిగిన గ్రీన్.. కొద్దిరోజుల క్రితం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. భారత్ తో సిరీస్ కు ఎంపికై ఇక్కడకు వచ్చినా గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టులలో ఆడలేదు.
ఆస్ట్రేలియాకు బ్యాక్ టు బ్యాక్ ఓటములతో పాటు స్టార్ క్రికెటర్లు దూరమైన విషయం తెలిసిందే. గాయం కారణంగా డేవిడ్ వార్నర్, జోష్ హెజిల్వుడ్ లు ఆస్ట్రేలియాకు తిరుగు పయనమవగా.. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ పాట్ కమిన్స్, స్పిన్నర్ ఆస్టన్ అగర్ కూడా ఆస్ట్రేలియాకు వెళ్లారు. మూడో టెస్టుతో పాటు అహ్మదాబాద్ టెస్టుకూ కమిన్స్ రాక అనుమానమే. ఈ నేపథ్యంలో గ్రీన్ రాక ఆ జట్టుకు కొంత మేలుచేసేదే. మరి స్పిన్నర్లు చెలరేగుతున్న భారత పిచ్ లపై గ్రీన్ ఏ మేరకు ప్రభావం చూపగలడన్నది త్వరలోనే తేలనుంది.