తీరుమారని కివీస్.. రెండో టెస్టులోనూ విజయం దిశగా ఇంగ్లాండ్..

Published : Feb 25, 2023, 11:37 AM IST
తీరుమారని కివీస్.. రెండో  టెస్టులోనూ విజయం దిశగా ఇంగ్లాండ్..

సారాంశం

NZvsENG: స్వదేశంలో ఇంగ్లాండ్ దెబ్బకు కివీస్ కుదేలవుతుంది. తమకు అనుకూలమైన పరిస్థితుల చోట  దారుణంగా విఫలమవుతున్నది. కివీస్ బ్యాటర్లు ఇంగ్లీష్ బౌలర్లకు  దాసోహమవుతున్నారు. 

తొలి టెస్టులో  దారుణంగా ఓడిన  న్యూజిలాండ్ రెండో టెస్టులోనూ అదే చెత్త ఆటను ప్రదర్శిస్తున్నది.   స్వదేశంలో తమకు అనుకూలంగా పరిస్థితులు ఉన్న చోట  దారుణంగా విఫలమవుతున్నది.  ఒక్కరంటే ఒక్కరు కూడా  కనీస ప్రతిఘటన లేకుండానే  ఇంగ్లాండ్ కు దాసోహమవుతున్నారు.  వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కూడా ఇంగ్లాండ్ తన జోరును కొనసాగిస్తున్నది. రెండో టెస్టు రెండో రోజు తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసిన ఆ  జట్టు.. కివీస్ ను తొలి రోజు ఆట ముగిసే సమయానికి  ఏడు వికెట్లు పడగొట్టి దెబ్బతీసింది. 

ఓవర్ నైట్ స్కోరు  315-3  వద్ద రెండో రోజు ఆట ఆరంభించిన   ఇంగ్లాండ్.. డబుల్ సెంచరీ చేస్తాడనుకున్న హ్యారీ బ్రూక్ (186) వికెట్ ను కోల్పోయింది. బెన్ స్టోక్స్ (27), బ్రాడ్ (14), రాబిన్సన్ (18)లు ధనాధన్ ఆడారు. నిన్న సెంచరీ చేసిన రూట్.. 153 పరుగులకు చేరుకోగానే  స్టోక్స్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. 

అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన కివీస్  స్కోరు బోర్డు పై పది పరుగులు కూడా చేరకుండానే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.   ఇంగ్లాండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్.. డెవాన్ కాన్వే (0) తో పాటు కేన్ విలియమ్సన్ (4) లను ఔట్ చేశాడు.  అదే ఊపులో విల్ యంగ్ (2) ను పెవిలియన్ కు పంపాడు.  21 పరుగులకే కివీస్ 3 వికెట్లను కోల్పోయింది. 

 

అయితే హెన్రీ నికోలస్ (30) తో కలిసి టామ్ లాథమ్ (35) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు.   కానీ 20వ ఓవర్ లో స్పిన్నర్ జాక్ లీచ్.. లాథమ్ ను ఔట్ చేశాడు. 24 వ ఓవర్లో నికోలస్ ను పెవిలియన్ కు పంపాడు.  డారిల్ మిచెల్ (13) కూడా ఎక్కువసేపు నిలువలేదు.  మైఖేల్ బ్రాస్‌వెల్ (6) ను బ్రాడ్ ఔట్ చేశాడు.  

103 కే ఏడు వికెట్లు కోల్పోయిన కివీస్ ను  వికెట్ కీపర్ టామ్ బ్లండల్ (25), కెప్టెన్ టిమ్ సౌథీ (23) లు ఆదుకున్నారు. రెండో రోజు వర్షం వల్ల ఆట ఆగిపోయే సమయానికి కివీస్.. 42 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి   138 పరుగులు చేసింది.  ఇంగ్లాండ్  తొలి ఇన్నింగ్స్ స్కోరు (435 ) కు కివీస్ ఇంకా  297 పరుగులు వెనుకబడి ఉంది.   ఆట మూడో రోజు మిగిలిన మూడు వికెట్లనూ పడగొట్టి  కివీస్ కే రెండో సారి బ్యాటింగ్ అప్పజెప్పి  మళ్లీ ఆలౌట్ చేసే యోచనలో బెన్ స్టోక్స్ సేన ఉంది.  ఇప్పటికే తొలి టెస్టులో ఓడి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న టిమ్ సౌథీ అండ్ కో. వెల్లింగ్టన్ లో కూడా ఓడితే ఇక  ముప్పేట దాడి తప్పకపోవచ్చు...!

 

PREV
click me!

Recommended Stories

Vaibhav Suryavanshi : ఒకే స్ట్రోక్‌లో కోహ్లీ, రోహిత్, సచిన్‌లకు షాకిచ్చిన వైభవ్ సూర్యవంశీ
రో-కో జోలికొస్తే కెరీర్‌లు కూడా ఉండవ్.. గంభీర్, అగార్కర్‌లకు గట్టి అల్టిమేటం