Rishabh Pant: అతడు ధోని, గిల్ క్రిస్ట్ ల రికార్డులు బద్దలు కొడతాడు.. టీమిండియా వికెట్ కీపర్ పై ప్రశంసల జల్లు

Published : Mar 15, 2022, 09:34 AM IST
Rishabh Pant: అతడు ధోని, గిల్ క్రిస్ట్ ల రికార్డులు బద్దలు కొడతాడు.. టీమిండియా వికెట్ కీపర్ పై ప్రశంసల జల్లు

సారాంశం

India vs Srilanka: భారత క్రికెట్ జట్టులో ధోని నిష్క్రమణ తర్వాత  దూసుకొచ్చిన యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్..  సమీప భవిష్యత్తులో మరిన్ని రికార్డులు బద్దలు కొడతాడని  మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. 

సమీప భవిష్యత్తులో భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని తో పాటు ఆస్ట్రేలియా లెజండరీ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ ల రికార్డులను టీమిండియా యువ ఆటగాడు, వికెట్ కీపర్ రిషభ్ పంత్  బద్దలు కొడతాడని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా రెండు టెస్టులలోనూ రాణించిన పంత్ పై టీమిండియా సారథి రోహిత్ శర్మతో పాటు  భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ప్రశంసలు కురిపించారు.  ఈ సిరీస్ లో భారత్ 2-0 తో   క్లీన్ స్వీప్ చేయడంలో పంత్ పాత్ర ఎంతో ఉందని కొనియాడారు.   పంత్ వయసు రీత్యా చాలా చిన్నవాడని, అతడు టీమిండియా తరఫున అద్భుతాలు సృష్టించడం ఖాయమని చెప్పారు. 

శ్రీలంకతో  బెంగళూరులో జరిగిన రెండో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... ‘అతడు (పంత్) ఎలా బ్యాటింగ్ చేస్తాడో మాకు తెలుసు. మేము అతడికి స్వేచ్ఛనిచ్చాం. పంత్ నచ్చిన ఆటను ఆడుతున్నాడు. అతడి గేమ్ ప్లాన్ అతడికుంది. అయితే స్వేచ్ఛనిచ్చామని అతడు దానిని దుర్వినియోగం చేయడం లేదు. పరిస్థితులకు అనుగుణంగా దానిని మనసులో పెట్టుకునే ఆడుతున్నాడు. 

అదే విషయాన్ని మేము అతడితో ఇప్పటికే చెప్పాం. పంత్ నుంచి ఎటువంటి ప్రదర్శన వచ్చినా దానిని అంగీకరించడానికి టీమ్ మేనేజ్మెంట్ సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ లో బ్యాటింగ్ తో పాటు అతడు వికెట్ కీపింగ్ చేసిన విధానం అద్భుతం. ఈ మధ్య కాలంలో అతడు చేసిన ఉత్తమ ప్రదర్శన ఇది..’ అని రోహిత్ చెప్పాడు. 

 

ఇక ఇదే విషయమై ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ... ‘అతడికి ఇప్పుడు 24 ఏండ్లే.  క్రికెట్ లో అడుగుపెట్టినప్పట్నుంచి ఇప్పటికీ అతడిలో చాలా మార్పు వచ్చింది.  అతడు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.  మరో పదేండ్లు పంత్ అంతర్జాతీయ కెరీర్ కొనసాగుతుందనడలో ఏమాత్రం సందేహం లేదు. ఈ క్రమంలో అతడు భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ అవుతాడు. అందులో సందేహమే లేదు’ అని అన్నాడు. 

టీమిండియా తరఫున టెస్టులలో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో ఎంఎస్ ధోని  ప్రథమ స్థానంలో ఉన్నాడు. ధోని.. 90 టెస్టులలో 4,876 పరుగులు చేశాడు. ఇక ప్రపంచ క్రికెట్ లో చూస్తే.. ఆసీస్ దిగ్గజం గిల్ క్రిస్ట్.. 96 టెస్టులలో 5,570 పరుగులు  సాధించాడు. ఇక పంత్ విషయానికొస్తే.. ఇప్పటికే 30 టెస్టులు ఆడిన పంత్.. 1,920 పరుగులు చేశాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తూ.. ఇంకా పదేండ్ల కెరీర్ ఉండటంతో అతడు ధోని, గిల్ క్రిస్ట్ లను అధిగమించడం పెద్ద విషయమేమీ కాదు. 

శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్ లో రెండు  మ్యాచుల (3 ఇన్నింగ్స్) లలో కలిపి పంత్ 185 పరుగులు చేశాడు. తొలి టెస్టులో 4 పరుగులతో సెంచరీ (96) మిస్ చేసుకున్నాడు. ఇక రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 39, రెండో ఇన్నింగ్స్ లో 50 పరుగులు చేశాడు. ఇక వికెట్ కీపింగ్ లో 8 ఔట్ లు (5 క్యాచులు, 3 స్టంపింగ్ లు) చేశాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. పంత్ కు టెస్టులలో ఇదే తొలి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : గిల్ రెడీనా? భారత జట్టులోకి ముగ్గురు స్టార్ల రీఎంట్రీ
Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు