
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నేడు 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు లిటిల్ మాస్టర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే అందరిలా కాకుండా ఏం చేసినా కాస్త డిఫరెంట్ గా చేసే టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. సచిన్ యాభయ్యోవ పుట్టినరోజు శుభాకాంక్షలను అందరికంటే భిన్నంగానే చెప్పాడు. శీర్షాసనం వేసి సచిన్ ను విష్ చేశాడు.
ట్విటర్ వేదికగా వీరూ స్పందిస్తూ.. ‘సచిన్ పాజీ.. మీరు గ్రౌండ్ లో నాతో చెప్పిన ప్రతీదానికి నేను వ్యతిరేకంగానే చేశాను. ఈ ప్రత్యేకమైన 50 వ బర్త్ డే లో కూడా నేను శీర్షాసనం వేసి శుభాకాంక్షలు చెబుతున్నా. మీరు వెయ్యేళ్లు వర్ధిల్లాలి. హ్యపీ 50 బర్త్ డే పాజీ..’ అని పేర్కొన్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
సచిన్ - వీరూలు కలిసి టీమిండియాకు 93 వన్డేలలో ఓపెనర్లుగా వచ్చారు. ఇద్దరూ కలిసి 42.13 సగటుతో 3,919 పరుగులు జోడించారు. సచిన్ - గంగూలీ తర్వాత టీమిండియా తరఫున బెస్ట్ ఓపెనింగ్ పెయిర్ ఈ ఇద్దరిదే. సచిన్ - వీరూలు కలిసి 12 శతక భాగస్వామ్యాలు, 18 అర్థ శతక భాగస్వామ్యాలు జోడించారు.
వీరూ శీర్షాసనమేసి చెప్పిన ఓ మాట.. ‘మీరు నాతో చెప్పిన ప్రతీదానికి నేను వ్యతిరేకంగానే చేశాను’ అన్నదానికి రీజన్ లేకపోలేదు. ముల్తాన్ టెస్టులో ట్రిపుల్ సెంచరీకి చేరువైన వీరూను.. సిక్సర్లు కొట్టొద్దని, కొడితే బ్యాట్ తో కొడతానని హెచ్చరించాడు. కానీ వీరూ మాత్రం 294 పరుగుల వద్ద భారీ సిక్సర్ బాదాడు. భారత్ తరఫున ఇది ఫస్ట్ ట్రిపుల్ సెంచరీ. అంతేగాక సెహ్వాగ్ బ్యాటింగ్ చేసేప్పుడు దూకుడు తగ్గించుకోవాలని, పరిస్థితులకు తగ్గట్టు ఆడాలని సచిన్ సూచించినా.. ‘ఇవన్నీ నాకు తెలియదు. నాది బాదుడు మంత్రమే..’ అన్నట్టుగా వ్యవహరించేవాడని స్వయంగా సెహ్వాగే పలు సందర్భాల్లో వెల్లడించాడు.