ట్విస్టులు లేవు, సస్పెన్స్ లేదు... కేకేఆర్‌ని చిత్తు చేసి, ‘టాప్’ పొజిషన్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్...

By Chinthakindhi RamuFirst Published Apr 23, 2023, 11:27 PM IST
Highlights

IPL 2023: 61 పరుగులు చేసిన జాసన్ రాయ్, హాఫ్ సెంచరీ అందుకున్న రింకూ సింగ్... చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు అందరికీ వికెట్లు ఇచ్చిన కేకేఆర్ బ్యాటర్లు..  టేబుల్ టాపర్‌గా చెన్నై సూపర్ కింగ్స్.. 

ఐపీఎల్‌లో వరుసగా సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసిన ఫ్యాన్స్‌కి, సీఎస్‌కే వన్‌సైడ్ వార్ చూపించింది. బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్, బౌలింగ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ చూపించి... కేకేఆర్‌పై 49 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది..

భారీ లక్ష్యఛేదనలో కేకేఆర్‌కి ఆదిలోనే షాక్ తగిలింది. 3 బంతులు ఆడిన సునీల్ నరైన్, ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. 1 పరుగు చేసిన నారాయణ్ జగదీశన్, తుషార్ దేశ్‌పాండే వేసిన ఓవర్‌లో అవుట్ అయ్యాడు. 1 పరుగు వద్దే 2 వికెట్లు కోల్పోయింది కేకేఆర్..

Latest Videos

20 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, మొయిన్ ఆలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసిన నితీశ్ రాణా, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 

26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసి, ఓ ఎండ్‌లో ఒంటరి పోరాటం చేసిన జాసన్ రాయ్, మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. డేంజరస్ బ్యాటర్ ఆండ్రే రస్సెల్ 9 పరుగులు చేసిన మతీశ పథిరాణా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చిన కేకేఆర్, ఏ దశలోనూ లక్ష్యంవైపు సాగుతున్నట్టు కనిపించలేదు. డేవిడ్ వీజ్ 1, ఉమేశ్ యాదవ్ 4 పరుగులు చేసి అవుట్ కాగా మరో ఎండ్‌లో రింకూ సింగ్  పోరాడినా ఆఖరి ఓవర్ వచ్చే సరికి కోల్‌కత్తా విజయానికి 6 బంతుల్లో 56 పరుగులు కావాల్సి వచ్చాయి. ఆఖరి ఓవర్ మూడో బంతికి సిక్సర్ బాదిన రింకూ సింగ్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన కేకేఆర్, 8 వికెట్ల నష్టానికి 186 పరుగులే చేయగలిగింది.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. కోల్‌కత్తాపై సీఎస్‌కేకి ఇదే అత్యధిక స్కోరు. మొదటి వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రుతురాజ్ గైక్వాడ్, 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేసి యంగ్ స్పిన్నర్ సుయాశ్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

34 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న డివాన్ కాన్వే, ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసిన డివాన్ కాన్వే, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో డేవిడ్ వీజ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

మూడో వికెట్‌కి అజింకా రహానేతో కలిసి 33 బంతుల్లో 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన శివమ్ దూబే, 21 బంతుల్లో 50 పరుగులు చేసి కుల్వంత్ కెజ్రోలియా బౌలింగ్‌లో జాసన్ రాయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆఖరి ఓవర్‌లో 2 సిక్సర్లు బాదిన రవీంద్ర జడేజా, 8 బంతుల్లో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఆఖరి రెండు బంతుల్లో బ్యాటింగ్‌కి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ... నో బాల్ కోసం రివ్యూ తీసుకుని సక్సెస్ అయ్యాడు...

ఫ్రీ హిట్ బాల్‌ని బాదడంలో ఫెయిల్ అయిన ధోనీ, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి 2 పరుగులు తీశాడు.  29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 పరుగులు చేసిన అజింకా రహానే అజేయ హాఫ్ సెంచరీతో నిలిచాడు.

click me!