ప్రపంచంలోనే రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్ ఐపిఎల్ లో మొదటిసారి ఓ గిరిజనుడికి చోటు దక్కింది. మహేంద్ర సింగ్ ధోని స్పూర్తితో క్రికెటర్ గా మారిన ఝార్ఖండ్ యువకుడు రాబిన్ మింజ్ ఐపిఎల్ వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయాడు.
IPL Auction 2023 : దుబాయ్ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంపాట అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సాగింది. తమకు నచ్చిన, జట్టుకు పనికివస్తాడనుకున్న ఆటగాళ్లను ఎన్ని కోట్లు పోసయినా కొనడానికి ఫ్రాంచైజీలు సిద్దపడ్డాయి. దీంతో కనీసం ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడని ఆటగాళ్లు సైతం కోట్ల ధర పలికారు. ఇలా ఝార్ఖండ్ కు చెందిన యువ క్రికెటర్ రాబిన్ మింజ్ కూడా ఈ ఐపిఎల్ వేలంలో భారీ ధర పలికాడు.
రాబిన్ మింజ్... ఈ ఐపిఎల్ వేలం ముందువరకు ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ ఝార్ఖండ్ కు చెందిన ఈ యువ ఆటగాడిలో మరో మహేంద్ర సింగ్ ధోనిని చూసారో ఏమో అతడిని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ధోనీలాగే వికెట్ కీపర్ మాత్రమే కాదు మంచి హిట్టింగ్ బ్యాటర్ అయిన అతడిని చివరకు గుజరాత్ టైటాన్స్ రూ.3.6 కోట్లకు కొనుగోలు చేసింది.
ఝార్ఖండ్ లో ఓ గిరిజన కుటుంబానికి చెందిన మింజ్ ఐపిఎల్ కు ఎంపికయ్యాడు. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ ఐపిఎల్ లో ఇప్పటివరకు ఒక్క గిరిజన క్రికెటర్ ఆడలేదు. కానీ ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన మింజ్ తన టాలెంట్ తో ఐపిఎల్ కు ఎంపికయ్యాడు. ఇలా ఐపిఎల్ లో ఆడనున్న తొలి గిరిజన క్రికెటర్ రాబిన్ మింజ్.
Also Read IPL auction 2024: ఇంతకీ సమీర్ రిజ్వీ ఎవరు?
ఇప్పటివరకు రాబిన్ మింజ్ కేవలం ఝార్ఖండ్ అండర్ 19 మాత్రమే ఆడాడు...రంజీ జట్టుకు కూడా ఆడలేదు. కానీ అతడిలోని టాలెంట్ ను గుర్తించి ఇదే ఐపిఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ వెన్నుతట్టింది. టాలెంట్ హంట్ లో మింజ్ ఆటకు ముగ్దులైన ముంబై టీం యాజమాన్యం బ్రిటన్ లో శిక్షణ ఇప్పించింది. దీంతో మింజ్ మరింత రాటుదేలాడు.
ఝార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాకు చెందిన మాజీ ఆర్మీ, ప్రస్తుత రాంచీ విమానాశ్రయ సెక్యూరిటీ అధికారి ప్రాన్సిస్ మింజ్ తనయుడు రాబిన్ మింజ్. కొడుకు క్రికెటర్ కావాలన్న కలను సాకారం చేసేందుకు ఈ తండ్రి పూర్తి సహకారం అందించాడు. దీంతో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ఐపిఎల్ వరకు మింజ్ చేరుకున్నారు. భారత జట్టులో చోటు దక్కించుకుని దేశం కోసం ఆడటమే ఈ 21 ఏళ్ల యువ క్రికెటర్ లక్ష్యమట.