
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. దక్షణాఫ్రికాతో తొలి టెస్టులో భాగంగా ఆట మూడో రోజు సఫారీలను తన పేస్ తో ముప్పుతిప్పలు పెట్టిన షమీ.. 5 వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. దీంతో అతడిపై దేశానికి చెందిన తాజా మాజీలే గాక దక్షిణాఫ్రికా కు చెందిన ఆటగాళ్లు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. షమీని చూస్తుంటే సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ షాన్ పొలాక్ తో పాటు ఇంగ్లాండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ గుర్తొస్తున్నారని సఫారీ మాజీ ఆటగాడు డరిల్ కలినన్ అభిప్రాయపడ్డాడు.
కలినన్ మాట్లాడుతూ.. ‘అతడి (షమీ) సీమ్ పొజిషన్ అద్భుతంగా ఉంది. అతడి బౌలింగ్ చూస్తుంటే నాకు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ షాన్ పొలాక్, ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ గుర్తుకొస్తున్నారు. వాళ్లు ఒక్క బంతిని కూడా వృథా చేయరు. ఒకవేళ బ్యాటర్ ఎవరైనా వారి బౌలింగ్ లో దాడికి దిగితే లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసిరి ఫలితాలు రాబడతారు.. షమీ కూడా ఆ కోవకే చెందుతాడు.. అతడి బంతులు మిమ్మల్ని నిరంతరం ప్రశ్నలు వేస్తూనే ఉంటాయి. అంతేగాక షమీ ప్రతి అడుగు వెనుక ఒక ఆలోచన ప్రక్రియ ఉందని మీరు గమనించవచ్చు...’ అని తెలిపాడు.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్సులో ఆ జట్టు 197 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. భారత పేస్ గుర్రాలు షమీకి 5 వికెట్లు తీయగా.. బుమ్రా, ఠాకూర్ లు రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్ కు ఒక వికెట్ దక్కింది.
ఇక భారత సీమర్లపై కూడా కలినాన్ ప్రశంసలు కురిపించాడు. ‘భారత పేస్ బౌలింగ్ బలంగా ఉంది. ఆ జట్టులోని ప్రతి బౌలర్ చాలా కష్టపడ్డారు. వారి శ్రమకు తగిన ఫలితం దక్కింది..’అని చెప్పాడు.
ఇక భారత జట్టుకు చెందిన పలువురు సీనియర్లు కూడా షమీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. టెస్టులలో 200 వికెట్ల మైలురాయిని సాధించిన షమీపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు మాజీ ఆటగాళ్లు వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, వసీం జాఫర్, ఆకాశ్ చోప్రా, మహ్మద్ కైఫ్, అజిత్ అగార్కర్, వెంకటేశ్ ప్రసాద్, కామెంటేటర్ హర్షా భోగ్లేలు షమీ ప్రదర్శనను కొనియాడారు.