హతవిధి...! ఆ ఇద్దరు ఇంగ్లాండ్ బ్యాటర్ల తర్వాత జట్టులో అత్యధిక పరుగులు చేసింది ఎక్స్ ట్రా లే..

Published : Dec 29, 2021, 11:44 AM IST
హతవిధి...! ఆ ఇద్దరు ఇంగ్లాండ్ బ్యాటర్ల తర్వాత జట్టులో అత్యధిక పరుగులు చేసింది ఎక్స్ ట్రా లే..

సారాంశం

England Cricket: యాషెస్ తో ఇంగ్లాండ్ కోరుకోని రికార్డులలో భాగస్వామ్యమవుతున్నది. ఇప్పటికే అత్యధిక డకౌట్లు అయిన జట్టుగా ఉన్న  రూట్ సేన.. తాజాగా మరో చెత్త రికార్డును నమోదు చేసింది. 

ఈ ఏడాది ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్  చరిత్రలో అత్యంత పేలవంగా గడిచింది. ఇప్పటికే స్వదేశంలో  ఇండియా, న్యూజిలాండ్ చేతిలో దారుణంగా ఓడి సిరీస్ లు అప్పగించిన ఇంగ్లాండ్.. తాజాగా యాషెస్ లో మరింత తీసికట్టుగా మారింది. ఇప్పటివరకు  ఆసీస్ తో మూడు టెస్టులాడిన రూట్ సేన.. ఒక్కదాంట్లో కూడా గెలవలేదు. గెలవడం సంగతి అటుంచితే కనీసం డ్రా చేసుకునే ప్రదర్శన కూడా చేయలేదు.  ఈ సిరీస్ తో కోరుకోని రికార్డులలో భాగస్వామ్యమవుతున్న ఆ జట్టు.. తాజాగా మరో చెత్త రికార్డును నమోదు చేసింది.  ఈ ఏడాది ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు  చేసిన ఆటగాళ్లలో జో రూట్, రోరీ బర్న్స్ తర్వాత అత్యధిక పరుగులు చేసింది ఎక్స్ ట్రా (అదనపు పరుగులు) లే. 

ఇంగ్లాండ్ వీర విధ్వంసక ఆటగాళ్లైన బెన్ స్టోక్స్, బెయిర్ స్టో, జోస్ బట్లర్ లు కూడా ఎక్స్ ట్రా ల తర్వాతే ఉన్నారు. ఈ క్యాలెండర్ ఇయర్ (టెస్టులు) లో రూట్ .. 1,708 పరుగులు చేయగా ఆ తర్వాత ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ (530 రన్స్ ) ఉన్నాడు. ఆ తర్వాత స్థానం ఎక్స్ ట్రా (412) దే.

 

బెయిర్ స్టో (391), పోప్ (368), బట్లర్ (308) ఆ తర్వాత స్థానంలో ఉన్నారు. ఇక యాషెస్ లో అదరగొట్టిన డేవిడ్ మలన్ (308),  ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (304) కూడా అదనపు పరుగుల కంటే తక్కువే స్కోరు చేయడం గమనార్హం.  ఇలా జరగడం ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 

ఇదిలాఉండగా ఇటీవలే ఆ జట్టు  క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక డకౌట్లు నమోదు చేసిన జట్టుగా కూడా రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. 2021 లో టెస్టు క్రికెట్ లో ఆ జట్టు 54 మంది ఆటగాళ్లు డకౌట్ గా వెనుదిరిగారు. 

రూట్.. దిగిపో.. : జెఫ్రీ బాయ్కాట్ 

యాషెస్ లో ఇంగ్లాండ్ ఓటమిపై ఆ దేశ మాజీలు జట్టు సారథి జో రూట్ మీద విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. రూట్ సేవలు ఇక చాలని,  సారథిగా వెంటనే దిగిపోవాలని సూచిస్తున్నారు. ఇదే విషయమై ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు జెఫ్రీ బాయ్కాట్  ది టెలిగ్రాఫ్ లో ఓ కథనం రాస్తూ.. ‘యాషెస్ లో ఆసీస్ ఇప్పుడు 3-0 ఆధిక్యంలో ఉంది.  కంగారూలు మనకంటే గొప్ప ఆటగాళ్లు అని చెప్పడం మానేస్తే ఇప్పటికైనా మంచింది రూట్. అతడు అక్కడి పాటే పాడతానంటే నాకు అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని మాత్రం ఏం  తెలియని వాళ్లలా ట్రీట్ చేయొద్దు.. రూట్ ఇంగ్లాండ్ సారథ్య బాధ్యతల్ని వదులుకునే సమయం వచ్చింది. వాస్తవాలు మనందరికీ కనబడుతున్నాయి.  గత మూడు టెస్టులలో మన  బ్యాటింగ్, బౌలింగ్ పేలవంగా ఉంది..’ అని అన్నాడు. 

PREV
click me!

Recommended Stories

RCB అభిమానులకు గుడ్ న్యూస్.. మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా !
ఇది కదా విధ్వంసం అంటే.! ఐపీఎల్ వేలంలో మళ్లీ ఆసీస్ ప్లేయర్ల ఊచకోత.. కొడితే కుంభస్థలమే