
ఇంగ్లాండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ అరుదైన ఘనత సాధించాడు. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 9 ఇన్నింగ్స్‌ల్లో 8 వందలకు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. తద్వారా ఇప్పటి వరకు 9 ఇన్సింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (798) రికార్డును బద్ధలు కొట్టారు. వినోద్ కంటే ముందు హెర్బర్ట్ సుట్ల్కిఫ్ (780), సునీల్ గావస్కర్ (778), ఎవర్టన్ వీకెస్ (777) వున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. రెండో టెస్టులో హ్యారీ 184 పరుగులతో వున్నాడు. మరోవైపు జో రూట్ (101) కూడా సెంచరీ బాదేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 294 పరుగులు జోడించారు. దీంతో ఇంగ్లీష్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది.
రెండో టెస్టులో టాస్ గెలిచిన కివీస్.. ఇంగ్లాండ్ కు బ్యాటింగ్ అప్పగించింది. తొలుత ఇంగ్లాండ్ కు భారీ షాక్ తాకింది. ఆ జట్టు ఓపెనర్లు జాక్ క్రాలే (2), బెన్ డకెట్ (9) లతో పాటు ఓలీ పోప్ (10) కూడా విఫలమయ్యారు. కానీ మాజీ సారథి జో రూట్ సాయంతో బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆది నుంచి దూకుడుగా ఆడిన బ్రూక్.. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. 107 బంతుల్లోనే అతడి సెంచరీ పూర్తయింది. ఫిఫ్టీ, హండ్రెడ్ లను ఫోర్ కొట్టి చేరుకున్న బ్రూక్.. 150 ని కూడా అదే విధంగా సాధించడం గమనార్హం. బ్రూక్ కివీస్ బౌలర్లను దంచికొడుతుంటే రూట్ మాత్రం నింపాదిగా ఆడాడు. సింగిల్స్, డబుల్స్ తో సెంచరీకి చేరుకున్నాడు.
ALso Read: వర్షం కంటే ముందే దంచికొట్టిన బ్రూక్.. జోరు కొనసాగిస్తున్న ఇంగ్లాండ్
ఈ మ్యాచ్ లో రూట్ సెంచరీ తర్వాత 65వ ఓవర్లో వర్షం ఆరంభమైంది. అప్పటికీ బ్రూక్.. డబుల్ సెంచరీకి 16 పరుగుల దూరంలోనే నిలిచాడు. వర్షం గనక అంతరాయం కలిగించకుంటే అతడు ద్విశతకం సాధించేవాడే. మరో 25 ఓవర్ల ఆట వర్షార్పణమైంది. ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా బ్రూక్ ఓ రికార్డును అందుకున్నాడు.
ఇదిలావుండగా.. త్వరలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిమిత్తం హ్యారీ బ్రూక్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.13.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఇతను ఈ సీజన్ ద్వారా తొలిసారిగా ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడు. ప్రస్తుతం అతడికి న్యూజిలాండ్ తో ఆడుతున్న టెస్టు ఆరో టెస్టు కావడం గమనార్హం. గతేడాది పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ టీమ్ లో అతడు సెంచరీల మోత మోగించడమే గాక రికార్డుల దుమ్ము దులిపాడు.