
న్యూఢిల్లీ: ఐసీసి మహిళల టీ20 ప్రపంచకప్ పోటీలో భాగంగా ఆస్ట్రేలియాపై జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో తన రన్నవుట్ మీద నస్సీర్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యకు భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌంటర్ ఇచ్చారు. ఏ కాస్తా కూడా పరిణతి లేకుండా చిన్న పిల్ల మాదిరి అంటూ హర్మన్ ప్రీత్ రన్నవుట్ మీద నసీర్ హుస్సేన్ వ్యాఖ్యానించాడు. స్కూల్ గర్ల్ మాదిరి అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడాడు. అంత సిల్లీగా అవుటవుతారా, ఎవరైనా అని వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న నసీర్ హుస్సేన్ అన్నాడు.
నసీర్ హుస్సేన్ వ్యాఖ్యకు హర్మన్ ప్రీత్ కౌంటర్ ఇచ్చింది. అవునా, ఆయన అలా మాట్లాడాడా, ఫరవాలేదు అని ఆమె అన్నారు. ఆయన అలా మాట్లాడినట్లు తనకైతే తెలియదని అన్నారు. అయినా అది నస్సీర్ హుస్సేన్ ఆలోచనా సరళికి అద్దం పడుతుందని హర్మన్ ప్రీత్ వ్యాఖ్యానించారు. పరుగులు పిండుకునే క్రమంలో సింగిల్ రన్ పూర్తి చేసిన అనంతరం మరో పరుగుకు ప్రయత్నించినప్పుడు బ్యాట్ అక్కడ స్ట్రక్ అయిందని ఆమె చెప్పారు.
వాస్తవానికి అది అత్యంత దురద్రుష్టకరమైన సంఘటన అని ఆమె అన్నారు. ఆస్ట్రేలియాపై జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో తాము చెత్తగా ఏమీ ఫీల్డింగ్ చేయలేదని అన్నారు. కొన్ని సార్లు బౌలింగ్ సరిగా చేయకపోవచ్చునని, కొన్ని సార్లు బ్యాటింగ్ బాగుండకపోవచ్చునని ఆమె అన్నారు. అన్ని విభాగాల్లో రాణిస్తేనే విజయం సాధించగలుగుతామని ఆమె అన్నారు.
ఆ రోజు తమ ప్రదర్శన మెరుగ్గానే ఉందని, అయితే దురద్రుష్టంకొద్దీ అలా జరిగిందని అన్నారు. తన రన్నవుట్ విషయంపై కూడా ఆమె మాట్లాడారు. నసీర్ హుస్సేన్ అన్నట్లు అదేమీ స్కూల్ గర్ల్ తప్పిదం కాదని, తాము పరిణతి గల ఆటగాళ్లమేనని, తాను కొన్నేళ్లుగా అంతర్జాతీయ మ్యాచులు ఆడుతున్నానని ఆమె అన్నారు. ఆయన ఆలోచన అలా ఉంటే తాను ఏమీ చేయలేనని అన్నారు. అది స్కూల్ గర్ల్ తప్పిదం కాదని మాత్రం చెప్పగలనని అన్నారు.
ఆస్ట్రేలియా బౌలర్ హారేహాం బౌలింగులో హర్మన్ ప్రీత్ అనూహ్యమైన రీతిలో రన్నవుట్ అయ్యారు. సింగిల్ పూర్తి చేసి మరో పరుగు తీసేందుకు ప్రయత్నించినప్పుడు డైమ్ చేసి గార్డనర్ డైవ్ చేసి బంతిని ఆపి వికెట్ కీపర్ వైపు విసిరింది. అయితే,బ్యాట్ స్ట్రక్ కావడంతో హర్మన్ ప్రీత్ రన్నవుట్ అయింది. అది ఆస్ట్రేలియాకు అనుకూలంగా మారింది. చివరకు టీమిండియా 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.