
తాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ గా ఉన్నప్పుడు తనపై విమర్శలు గుప్పించిన వారందరికీ ఆ పదవి నుంచి దిగిపోయిన తర్వాత రమీజ్ రాజా బదులు చెల్లిస్తున్నాడు. గతంలో రమీజ్ పీసీబీ చీఫ్ గా తీసుకున్న నిర్ణయాలపై బహిరంగంగా విమర్శలు చేయడమే గాక తన ఆత్మకథలో రమీజ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్రమ్ పై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోకుంటే ఇంట్లో కూర్చోవాలని.. ప్రజల్లోకి వచ్చి పిచ్చిపిచ్చి పనులు చేయొద్దని హెచ్చరించాడు.
అసలేం జరిగిందంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) - 2023 సీజన్ లో భాగంగా రెండ్రోజుల క్రితం వసీం అక్రమ్ కు వాటాలున్న కరాచీ కింగ్స్ - ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో కరాచీ మూడు పరుగుల తేడాతో ఓడింది.
చేతులదాకా వచ్చిన మ్యాచ్ ఓడటంతో వసీం అక్రమ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. తన ముందున్న చైర్స్ ను గట్టిగా తన్నుతూ అసహనం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఇదే ఛాన్స్ అనుకున్నాడో ఏమో గానీ రమీజ్ రాజా ఈ వీడియోపై స్పందించాడు. అక్రమ్ పేరు ఎత్తకుండానే.. ‘మీరు బయట కూర్చుని ఏమీ చేయలేరు. మీరు మీ ఆటగాళ్లకు మద్దతుగా నిలవాలి. ప్రశాంతమైన మైండ్ తో పరిస్థితులను విశ్లేషించాలి అలా కాకుండా ఇలా చేస్తే అది మీలో మరింత ఫ్రస్ట్రేషన్ ను పెంచుతుంది. అంతేగాక.. ఇది చూడటానికి కూడా చాలా ఛండాలంగా ఉంటుంది. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి తన టెంపర్ ను తాను కంట్రోల్ చేసుకోకుంటే ప్రజల్లో ఉండకపోవడమే మంచిది...’ అని సెటైర్లు వేశాడు.
ముల్తాన్ సుల్తాన్స్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన మహ్మద్ రిజ్వాన్ సారథ్యంలోని ముల్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రిజ్వాన్.. 64 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. షాన్ మసూద్ (51) హాఫ్ సెంచరీ చేశాడు. లక్ష్య ఛేదనలో కరాచీ.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో జేమ్స్ వీన్స్ (75), ఇమాద్ వసీం (46) రాణించినా విజయానికి మూడు పరుగుల దూరంలో నిలిచింది.
ఇక కరాచీ కింగ్స్ ను వైఫల్యాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 సీజన్ లో విజేతగా నిలిచిన కరాచీ.. గత సీజన్ లో 10 మ్యాచ్ లలో ఒక్కటే గెలిచింది. దీంతో ఆ జట్టు సారథి బాబర్ ఆజమ్ ను మార్చి ఇమాద్ వసీంను సారథిగా నియమించుకుంది. ఇప్పటివరకు ఈ లీగ్ లో ఐదు మ్యాచ్ లు ఆడిన కరాచీ.. ఒక్క మ్యాచ్ లోనే గెలిచింది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచ్ లనూ గెలవాల్సి ఉంది.