India T20 World Cup 2024 squad : జూన్‌లో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఉండనున్నారు. 15 మందితో కూడిన భారత జట్టులో యంత్ ప్లేయర్లు కూడా ఉన్నారు. భారత జట్టులోని 15 మంది ప్లేయర్ల ప్రత్యేకతలు గమనిస్తే..
T20 World Cup India Squad: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మంది స్టార్లను ఎంపిక చేసింది. మరో నలుగురు ప్లేయర్లను రిజర్వు జాబితాలో ఉంచారు. విరాట్ కోహ్లి, యుజువేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ ప్లేయర్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు. జూన్ 1 నుంచి 29 వరకు వెస్టిండీస్-అమెరికా వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. జూన్ 5న ఐర్లాండ్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న దాయాదుల పోరులో జూన్ 9న పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఇక టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన మొత్తం 15 మంది ఆటగాళ్ల టీ20 రికార్డులు, ప్రదర్శనలు గమనిస్తే..
రోహిత్ శర్మ
2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సభ్యుడు. భారత్ తరఫున 151 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. హిట్ మ్యాన్ 31.79 సగటుతో 3974 పరుగులు చేశాడు. రోహిత్ పేరిట 5 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 139.97. ఇక టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ 39 మ్యాచ్‌లలో 34.39 సగటుతో 963 పరుగులు సాధించాడు.
విరాట్ కోహ్లీ
టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి ప్రదర్శన ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కింగ్ కోహ్లీ. కోహ్లి భారత్ తరఫున 117 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 51.75 సగటు, 138.15 స్ట్రైక్ రేట్‌తో 4037 పరుగులు కొట్టాడు. టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ.. 27 మ్యాచ్‌ల్లో 81.50 సగటు, 131.30 స్ట్రైక్ రేట్ తో 1141 పరుగులు చేశాడు.
యశస్వి జైస్వాల్
22 ఏళ్ల యశస్వి జైస్వాల్ తొలిసారిగా టీ20 ప్రపంచకప్ ఆడనున్నాడు. గతేడాది ఈ ఫార్మాట్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన జైస్వాల్.. 17 మ్యాచ్‌ల్లో 33.46 సగటు, 161.93 స్ట్రైక్ రేట్ తో 502 పరుగులు చేశాడు.
సూర్యకుమార్ యాదవ్
టీ20 క్రికెట్ టాప్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన సూర్యకుమార్ యాదవ్.. భారత్ తరఫున 60 టీ20 మ్యాచ్‌లు ఆడి 45.55 సగటుతో 2141 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 171.55. సూర్యకుమార్ 4 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు సాధించాడు. రెండు టీ20 ప్రపంచకప్‌ల్లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడాడు. 56.20 సగటు, స్ట్రైక్ రేట్ 181.29 తో 281 పరుగులు సాధించాడు.
రిషబ్ పంత్
భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఘోర కారు ప్రమాదంతో దాదాపు 15 నెలల తర్వాత క్రికెట్ ఆడుతున్నాడు. ఐపీఎల్ 2024తో మళ్లీ పాత ఫామ్‌లోకి వచ్చాడు. భారత్ తరఫున పంత్ 66 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 22.43 సగటు, 126.37 స్ట్రైక్ రేట్‌తో 987 పరుగులు రాబట్టాడు. టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో 21.75 సగటుతో 87 పరుగులు కొట్టాడు.
సంజూ శాంసన్
భారత క్రికెట్ లో ఎక్కువగా చర్చకు వచ్చే ప్లేయర్ సంజూ శాంసన్. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు శాంసన్ జట్టులో రెండో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ గా చోటుదక్కించుకున్నాడు. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్‌లను వెనక్కినెట్టి వరల్డ్ కప్ జట్టులోకి వచ్చాడు. శాంసన్ 25 టీ20 మ్యాచ్‌ల్లో 374 పరుగులు చేశాడు. అతని సగటు 18.70, స్ట్రైక్ రేట్ 133.09. తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో ఆడబోతున్నాడు.
హార్దిక్ పాండ్యా
గతేడాది వన్డే ప్రపంచకప్ సందర్భంగా గాయపడిన హార్దిక్ పాండ్యా మళ్లీ ఐపీఎల్ తో గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్ తరఫున 92 టీ20 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ 1348 పరుగులు చేశాడు. సగటు 25.43, స్ట్రైక్ రేట్ 139.83. హార్దిక్ 73 వికెట్లు తీశాడు. టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ 16 మ్యాచ్‌లు ఆడి 243 పరుగులతో పాటు 13 వికెట్లు తీసుకున్నాడు.
శివమ్ దూబే
ఐపీఎల్‌లో ధనాధన్ ఇన్నింగ్స్ లతో అదరగొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన శివమ్ దూబే తొలిసారి టీ20 ప్రపంచ కప్ ఆడబోతున్నాడు. భారత్ తరఫున 21 మ్యాచ్‌లు ఆడాడు. 39.42 సగటుతో 276 పరుగులు చేశాడు. 145.26 స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. అలాగే, శివమ్ దుబే 8 వికెట్లు కూడా తీశాడు.
రవీంద్ర జడేజా
భారత అత్యంత అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ఈసారి జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. జడేజా భారత్ తరఫున టీ20లో 66 మ్యాచ్‌లు ఆడి 480 పరుగులు చేశాడు. సగటు 22.85, స్ట్రైక్ రేట్ 125.32 కలిగి ఉన్న జడేజా.. 53 వికెట్లు కూడా తీశాడు. టీ20 ప్రపంచకప్ లో 22 మ్యాచ్‌ల్లో 95 పరుగులు కొట్టడంతో పాటు 21 వికెట్లు కూడా తీశాడు.
అక్షర్ పటేల్
అక్షర్ పటేల్ కు 52 టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. 49 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ విషయానికి వస్తే 19.00 సగటు, 144.40 స్ట్రైక్ రేట్‌తో 361 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో 5 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో 7 పరుగులు, 3 వికెట్లు తీసుకున్నాడు.
కుల్దీప్ యాదవ్
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ భారత్ తరఫున 35 టీ20 మ్యాచుల్లో 59 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం దేశంలోని అత్యుత్తమ స్పిన్ బౌలర్లలో ఒకడు. టీ20 ప్రపంచకప్‌లో కుల్దీప్ ఇంకా ఆడలేకపోయాడు. ఈసారి అతని ఫామ్ చూస్తుంటే ప్లేయింగ్ 11లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
యుజ్వేంద్ర చాహల్
టీ20 ఫార్మాట్‌లో భారత అనుభవజ్ఞుడైన ఆటగాళ్లలో ఒకరైన యుజ్వేంద్ర చాహల్‌పైనే అందరి దృష్టి ఉంటుంది. 80 మ్యాచ్‌లు ఆడి 96 వికెట్లు తీశాడు. కుల్దీప్ లాగే చాహల్ కూడా తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఆడనున్నాడు.
జస్ప్రీత్ బుమ్రా
టీమిండియా జట్టులో ప్రధాన ఆటగాళ్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ భారం మోయనున్నాడు. ఇప్పటి వరకు 62 టీ20 మ్యాచ్‌లు ఆడి 74 వికెట్లు తీశాడు. టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో 11 వికెట్లు తీశాడు.
అర్ష్దీప్ సింగ్
పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడిన అర్ష్‌దీప్ సింగ్ గత టీ20 ప్రపంచకప్ భారత జట్టులో కూడా ఉన్నాడు. ఇప్పటివరకు 44 టీ20 మ్యాచ్‌లు ఆడి 66 వికెట్లు పడగొట్టాడు. గత టీ20 ప్రపంచకప్‌లో అర్ష్‌దీప్ సింగ్ 6 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు.