
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో గాయపడిన దీపక్ చాహార్, ఇప్పట్లో రీఎంట్రీ ఇచ్చేలా కనిపించడం లేదు. దీపక్ చాహార్ గాయం నుంచి పూర్తిగా కోలుకుని, మ్యాచ్ ఆడడానికి కావాల్సిన ఫిట్‌నెస్ సాధించడానికి మరో ఐదారు వారాల సమయం పడుతుందని అంచనా...
ఐపీఎల్ 2022 సీజన్‌లో దీపక్ చాహార్‌ని రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే సీజన్ ఆరంభానికి ముందు లంకతో వన్డే సిరీస్‌లో గాయపడిన దీపక్ చాహార్, ఐపీఎల్ 2022 మొత్తానికి దూరమయ్యాడు. ఆరంభంలో సీజన్ మధ్యలో దీపక్ చాహార్, జట్టుకి అందుబాటులోకి వస్తాడని ప్రచారం జరిగినా జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో అతను మరోసారి గాయపడడంతో అది జరగలేదు...
‘నేను ఇప్పుడు రిహాబ్ ప్రోగ్రామ్‌లో నాలుగైదు ఓవర్లు బౌలింగ్ చేస్తున్నా. గాయం నుంచి త్వరగానే కోలుకుంటున్నా. మరో నాలుగైదు వారాల్లో మ్యాచ్ ఆడడానికి కావాల్సిన ఫిట్‌నెస్ సాధిస్తానని అనుకుంటున్నా...’ అంటూ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు క్రికెటర్ దీపక్ చాహార్..
దీపక్ చాహార్ గాయం నుంచి కోలుకోవడానికి సమయం పడుతుండడంతో అతని స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, కౌంటీ క్లబ్ లంకాషైర్ తరుపున ఆడబోతున్నాడు. త్వరలో ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లే వాషింగ్టన్ సుందర్, టీమిండియాతో జరిగే నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో లంకాషైర్ తరుపున బరిలో దిగుతాడు...
‘వాషింగ్టన్ సుందర్ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఇప్పుడు అతనికి గేమ్ ప్రాక్టీస్ కావాలి. కాబట్టి లంకాషైర్ తరుపున బరిలో దిగి, వార్మప్ మ్యాచ్ ఆడతాడు...’ అని తెలిపాడు ఓ బీసీసీఐ అధికారి...
దీపక్ చాహార్, ఇంగ్లాండ్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్ సమయానికి కోలుకుంటాడని భావించారు సెలక్టర్లు. ఇప్పుడు కోలుకోవడానికి మరో నాలుగైదు వారాల సమయం పడుతుందని తేలడంతో దీపక్ చాహార్‌కి ఇంగ్లాండ్ టూర్‌లో చోటు దక్కకపోవచ్చు. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్‌లలో ఒకరికి ఈ టూర్‌లో అవకాశం రావచ్చు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన వాషింగ్టన్ సుందర్, టీమిండియా తరుపున 4 టెస్టులు ఆడి 66.25 సగటుతో 265 పరుగులు చేశాడు. కెఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకి దూరం కావడం, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఫిట్‌నెస్‌లపై అనుమానాలు ఉండడంతో వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి కోలుకోవడం టీమిండియాకి కలిసొచ్చే విషయం...
అతనితో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన మరో ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ కూడా ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. ఐపీఎల్ 2020 సీజన్ పర్ఫామెన్స్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి, ఆస్ట్రేలియా టూర్ 2020-21 సీజన్‌లో ఒకే టూర్‌లో మూడు ఫార్మాట్లలో ఆరంగ్రేటం చేసిన నటరాజన్... ఆ తర్వాత గాయాలతో జట్టుకి దూరమయ్యాడు..
ప్రస్తుతం టి నటరాజన్, దీపక్ చాహార్‌తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్... బెంగళూరులో ఎన్‌సీఏలో రిహాబ్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటుంటే... సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి ముందు గాయపడిన కెఎల్ రాహుల్, జర్మనీలో చికిత్స తీసుకుంటున్నాడు. దాదాపు నెల రోజుల పాటు జర్మనీలో గడిపే కెఎల్ రాహుల్, ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ సమయానికి జట్టుకి అందుబాటులోకి వస్తాడని ఆశిస్తోంది టీమిండియా మేనేజ్‌మెంట్..