షాపింగులు తర్వాత.. మాస్కులు పెట్టుకోండి ముందు.. ఆ విషయం మరిచిపోయారా..? టీమిండియాకు బీసీసీఐ వార్నింగ్

Published : Jun 21, 2022, 05:24 PM IST
షాపింగులు తర్వాత.. మాస్కులు పెట్టుకోండి ముందు.. ఆ విషయం  మరిచిపోయారా..? టీమిండియాకు బీసీసీఐ వార్నింగ్

సారాంశం

India Tour Of England: ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన  టీమిండియా  ఆటగాళ్లు  షాపింగులకు తిరగడాన్ని బీసీసీఐ సీరియస్ గా తీసుకుంది. గతేడాది జరిగింది గుర్తులేదా..? అని హెచ్చరించింది. 

గతేడాది ఇంగ్లాండ్ తో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐదో టెస్టు మ్యాచ్ ఆడేందుకు యూకేకు వెళ్లిన భారత జట్టుకు బీసీసీఐ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. షాపింగులకని.. ఫ్యాన్స్ తో ఫోటోలకోసమని ఫోజులిస్తున్న ఆటగాళ్లు బయటకు వెళ్తే  మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించింది. రోహిత్, కోహ్లిలు షాపింగ్ కోసం బయటకు వెళ్లినప్పుడు మాస్కులు లేకుండానే తిరిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 ఈ నేపథ్యంలో గతేడాది  కరోనా వల్ల సిరీస్ మధ్యలోనే నిలిచిపోయిన విషయాన్ని మరిచిపోవద్దని బీసీసీఐ గుర్తు చేసింది. ఎడ్జబాస్టన్ లో జులై 1 నుంచి ఐదో టెస్టు ప్రారంభం కావాల్సి ఉండగా బీసీసీఐ ఆటగాళ్లకు ఈ కీలక సూచన చేసింది.

ఇదే విషయమై బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ‘యూకేలో కోవిడ్ తీవ్రత తగ్గింది. కానీ ప్లేయర్లు మాత్రం బయటకు వెళ్లినప్పుడు మాస్కులను తప్పనిసరిగా ధరించాలి. జాగ్రత్తగా ఉండాలని  ఆటగాళ్లకు సూచించాం..’ అని తెలిపాడు. 

 

ప్రస్తుతం యూకేలో రోజుకు పదివేల వరకు కేసుల వరకు నమోదవుతున్నాయి. ఇంగ్లాండ్ లో కరోనా బారిన పడితే ఐదు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలన్న నిబంధన ఉంది.  ఈ నేపథ్యంలో ఆటగాళ్లెవరైనా టెస్టుకు ముందు కరోనా పాజిటివ్ అని తేలితే ఇబ్బందులు తప్పవని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచుల టెస్టు సిరీస్ లో కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, బ్రాస్వెల్ కూడా కరోనా బారిన పడ్డ విషయాన్ని కూడా టీమిండియాకు  గుర్తు చేస్తున్నది. 

గతేడాది  ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి తో పాటు కోచింగ్ సిబ్బందిలోని భరత్ అరుణ్, శ్రీధర్ లకు కూడా కరోనా సోకింది. దీంతో ఐదో టెస్టును అర్థాంతరంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. 

ఇక తాజాగా ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరడానికి ముందు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా కరోనా బారిన పడటంతో  బీసీసీఐ.. ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సేందనని భావిస్తున్నది. విరాట్ కోహ్లి, శుభమన్ గిల్, మహ్మద్ సిరాజ్, షమీ, బుమ్రాలతో పాటు దక్షిణాఫ్రికా సిరీస్ కు దూరంగా ఉన్న పలువురు ఆటగాళ్లు జూన్ 16న ఇంగ్లండ్ కు పయనమయ్యారు. ఇక ఈనెల 19న సఫారీ సిరీస్ ముగిసిన తర్వాత  రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ కూడా యూకే  విమానమెక్కారు. ఈ రెండు బ్యాచ్ లలో కూడా అశ్విన్ కనిపించకపోయేసరికి టీమిండియా అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

 అతడు ఇంగ్లండ్ తో కీలకమైన ఐదో టెస్టు ఆడతాడా..? లేదా.?? అనే అనుమానం వ్యక్తమైంది. అయితే ఈనెల 16 కంటే ముందే  అశ్విన్ కరోనా బారిన పడ్డాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి అతడు ఐసోలేషన్ లో ఉన్నాడని.. త్వరలోనే కోలుకుని ఇంగ్లాండ్ కు బయల్దేరతాడని బీసీసీఐ తెలిపింది. 

జులై 1న ఇంగ్లండ్ తో ప్రారంభమయ్యే ఐదో టెస్టుకు ముందు టీమిండియా.. లీసెస్టర్‌షైర్‌తో (జూన్ 24 నుంచి నాలుగు రోజులు) ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మేరకు ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ లో నిమగ్నమైంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?