DCvsKXIP: మ్యాచ్ టై... సీజన్‌లో మొదటి సూపర్ ఓవర్ మ్యాచ్‌...

By team teluguFirst Published Sep 20, 2020, 11:28 PM IST
Highlights

కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పంజాబ్‌ను కట్టడి చేసిన ఢిల్లీ బౌలర్లు...

మయాంక్ అగర్వాల్ మినహా పంజాబ్ బ్యాట్స్‌మెన్ అందరూ ఫెయిల్...

స్టోయినిస్ సూపర్ షో...

IPL 2020: 13వ సీజన్‌లో రెండో మ్యాచ్ కూడా క్రికెట్ ప్రేక్షకులకు కావాల్సినంత మజాను అందించింది. అంచనాలను తలకిందులు చేస్తూ, ఆధిక్యం చేతులు మారుతూ వచ్చిన మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కి వెళ్లింది. ఆఖరి రెండు బంతుల్లో ఒక్క పరుగు కావాల్సిన దశలో రెండు వికెట్లు కోల్పోయింది పంజాబ్.. మొదటి ఇన్నింగ్స్‌లో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా ఆకట్టుకోగా, ఆఖర్లో స్టోయినిస్ సూపర్ షో కారణంగా అన్యూహ్యంగా 157 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. 

పంజాబ్‌కి మంచి ఆరంభం దక్కినా... అన్యూహ్యంగా పుంజుకున్న ఢిల్లీ బౌలర్లు కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌కి కోలుకోలేని షాక్ ఇచ్చారు. 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్, 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కృష్ణప్ప గౌతమ్‌తో కలిసి వికెట్ల పతనాన్ని కాసేపు ఆపాడు మయాంక్ అగర్వాల్. అయితే 14 బంతుల్లో 20 పరుగుల చేసిన గౌతమ్‌ను రబాడా అవుట్ చేయడంతో 101 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది పంజాబ్. 

అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేశాడు మయాంక్ అగర్వాల్. ఆఖరి 18 బంతుల్లో 42 పరుగులు కావాల్సిన దశలో 2 సిక్సర్లు బాది... మ్యాచ్‌పై ఆశలు నిలిపాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఒంటి చేత్తో విజయానికి ఒక్క పరుగు కావాల్సిన దశలో అవుట్ అయ్యాడు. చివరి బంతికి ఒక్క పరుగు కావాల్సిన దశలో పంజాబ్ వికెట్ కోల్పోవడంతో స్కోర్లు సమం అయ్యారు. . 

ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసిన అశ్విన్, గాయంతో క్రీజులో నుంచి వెనుదిరిగాడు. రబాడా రెండు, అక్షర్ పటేల్, మోహిత్ శర్మ చెరో వికెట్ తీశారు. 

click me!