DCvsKXIP: స్టోయినిస్ ‘వన్ మ్యాన్ షో’... బద్దలైన రికార్డులు...

By team teluguFirst Published Sep 20, 2020, 10:07 PM IST
Highlights

‘వన్ మ్యాన్ షో’తో పూర్తిగా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన స్టోయినిస్...

20 బంతుల్లో హాఫ్ సెంచరీ...

ఆఖరి ఓవర్లో స్టోయినిస్ మెరుపులతో ఢిల్లీకి మంచి స్కోరు..

ఐపీఎల్ 2020 రెండో మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు కావాల్సినంత మజాను అందిస్తోంది. 16.1 ఓవర్లలో 96 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్.. 120 పరుగులు చేయడం కూడా కష్టమే అనిపించింది. అయితే ఆఖర్లో వచ్చిన ఆసీస్ ప్లేయర్ స్టోయినిస్... ‘వన్ మ్యాన్ షో’తో పూర్తిగా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.

19వ ఓవర్‌లో మూడు ఫోర్లతో 14 పరుగులు రాబట్టిన స్టోయినిస్, ఆఖరి ఓవర్లో రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 24 పరుగులు రాబట్టాడు. నో‌ బాల్‌కి రనౌట్ కావడంతో ఆఖరి బంతికి మరో 3 పరుగులు వచ్చాయి. సునామీ ఇన్నింగ్స్‌తో ఢిల్లీకి ఓ బాధ్యతాయుతమైన స్కోరుని అందించిన స్టోయినిస్... ఈ దశలో పలు రికార్డులను నమోదుచేశాడు.

దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు స్టోయినిస్. ఇంతకుముందు మిల్లర్ 19 బంతుల్లో ఇక్కడ 50 పరుగుల మార్క్ దాటగా, స్టోయినిస్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. ఢిల్లీ తరుపున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు స్టోయినిస్. ఇంతకుముందు క్రిస్ మోరిస్ 17 బంతుల్లో, రిషబ్ పంత్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశారు. 

ఆఖరి మూడు ఓవర్లలో అత్యధిక పరుగులు రాబట్టిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు స్టోయినిస్ (14 బంతుల్లో 49 పరుగులు). అతని కంటే ముందు కోహ్లీ (14 బంతుల్లో 57 పరుగులు), రస్సెల్ (17 బంతుల్లో 50 పరుగులు) ఉన్నారు.

click me!