Daryl Mitchell: పరుగు తీయనందుకు ప్రతిష్ట పెరిగింది.. ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్న కివీస్ క్రికెటర్

Published : Feb 02, 2022, 05:46 PM ISTUpdated : Feb 02, 2022, 05:48 PM IST
Daryl Mitchell: పరుగు తీయనందుకు ప్రతిష్ట పెరిగింది.. ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్న కివీస్ క్రికెటర్

సారాంశం

ICC Spirit Of Cricket Award 2021: ఉత్కంఠగా సాగుతున్న మ్యాచులో గెలుపు రెండు జట్ల మధ్య ఊగిసలాడుతున్న సమయంలో  ప్రతి పరుగూ ముఖ్యమే. కానీ అంత టెన్షన్ లో కూడా  ఒక ఆటగాడు సులువుగా తీయగలిగిన పరుగును తీయలేదు...  

‘ఎక్కడ  నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో  తెలిసినోడు గొప్పోడు’ అంటాడు పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో  ఎంఎస్ నారాయణ. ‘కొన్నిసార్లు గెలవడం కంటే ఓడిపోవడమే కరెక్ట్.. పట్టుకోవడం కంటే పడిపోవడమే కరెక్ట్’ అంటాడు ఓ సినిమాలో అల్లు అర్జున్.. ‘తగ్గితే తప్పేమిరా..?’ అంటాడు  అరవింద సమేతలో జూనియర్ ఎన్టీఆర్. ఈ డైలాగులన్ని ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం..  ఉత్కంఠగా సాగుతున్న మ్యాచులో గెలుపు రెండు జట్ల మధ్య ఊగిసలాడుతున్న సమయంలో  ప్రతి పరుగూ ముఖ్యమే. కానీ అంత టెన్షన్ లో కూడా  ఒక ఆటగాడు సులువుగా తీయగలిగిన పరుగు తీయనందుకు గాను ఇప్పుడు అత్యున్నత క్రీడా పురస్కారం పొందబోతున్నాడు. ఆ ఆడగాడి పేరు డారిల్ మిచెల్. అప్పుడు పరుగు తీయకుండా వెనక్కి తగ్గిన మిచెల్.. ఇప్పుడు దిగ్గజాల సరసన నిలువబోతున్నాడు.

న్యూజిలాండ్ క్రికెటర్  డారిల్ మిచెల్ ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ 2021 అవార్డును గెలుచుకున్నాడు. గతేడాది దుబాయ్  వేదికగా ముగిసిన  టీ20 ప్రపంచకప్ లో  క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించినందుకు గాను  అతడికి ఈ అవార్డు దక్కింది.  

ఒకసారి వెనక్కి వెళ్తే.. 

అది టీ 20 ప్రపంచకప్ 2021 లో భాగంగా  ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్  166 పరుగులు చేసింది.  లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ అద్భుతంగా రాణించింది. ఆ జట్టు ఓపెనర్ మిచెల్ వీరోచితంగా పోరాడి కివీస్ ను  ఫైనల్ కు చేర్చాడు. ఆ క్రమంలో ఇంగ్లాండ్ తో  సెమీస్ తో  మ్యాచ్ సందర్భంగా.. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ఆదిల్ రషీద్ బంతిని క్రీజులో ఉన్న జిమ్మీ నీషనమ్ మిడాఫ్ దిశగా ఆడాడు.  అక్కడ ఈజీగా సింగిల్ తీయడానికి ఆస్కారముంది. కానీ  అదే సమయంలో అక్కడ ఫీల్డర్లెవరూ లేకపోవడంతో   బౌలర్ రషీదే  బంతి కోసం పరుగెత్తుతున్నాడు. ఈ క్రమంలో రషీద్ కు మిచెల్ అడ్డువచ్చాడు. 

 

ఇక్కడే మిచెల్  క్రీడా స్ఫూర్తిని చాటాడు. సింగిల్ వద్దంటూ నీషమ్ ను వారించి తిరిగి  తన స్థానానికే వెళ్లాడు.  అప్పుడు మిచెల్ ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తికి  కామెంటరీ బాక్స్ లో ఉన్న  ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ ఫిదా అయ్యాడు. మిచెల్ చేసిన పని చాలా గొప్ప విషయమని అభివర్ణించాడు. హుస్సేన్ తో పాటు చాలా మంది డారిల్ మిచెల్ ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తికి  సలాం కొట్టారు. 

ఇంతమంది పొగుడుతుంటే ఐసీసీ మాత్రం చూస్తూ  ఊరికే ఉంటుందా..? అది కూడా పురస్కారాన్ని అందజేసి ఆ ఆటగాడికి మరింత గౌరవాన్ని పెంచింది.  ఇక ఇంగ్లాండ్ తో ముగిసిన నాటి మ్యాచులో  న్యూజిలాండ్  ఘన విజయం సాధించి ఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే.  ఆ మ్యాచులో  మిచెల్ 47 బంతుల్లో  72 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

దిగ్గజాల సరసన.. 

ఇక ఈ అవార్డు అందుకున్న  నాలుగో  కివీస్ క్రికెటర్ మిచెల్. అంతకుముందు డేనియల్ వెటోరి, బ్రెండన్ మెక్కల్లమ్, కేన్ విలియమ్సన్ లు ఈ అవార్డును దక్కించుకున్నారు.  టీమిండియా నుంచి జార్ఖండ్ డైనమైట్, భారత మాజీ సారథి మహేంద్ర  సింగ్ ధోని (2011), విరాట్ కోహ్లి (2019) లో ఈ అవార్డును గెలుచుకున్నారు.

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !