IPL 2022: బీసీసీఐ సమర్పించు ఐపీఎల్ వారి పాట.. పది రోజుల్లో జరుగబోయే మెగావేలం గురించి సవివరంగా..

Published : Feb 02, 2022, 03:23 PM ISTUpdated : Feb 03, 2022, 07:39 PM IST
IPL 2022: బీసీసీఐ సమర్పించు ఐపీఎల్ వారి పాట.. పది రోజుల్లో జరుగబోయే  మెగావేలం గురించి సవివరంగా..

సారాంశం

IPL 2022 Auction: బెంగళూరు వేదికగా రెండ్రోజుల పాటు జరుగబోయే ఐపీఎల్ వేలానికి సర్వం సిద్ధమైంది. తమకు ఇష్టమైన ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ దక్కించుకోబోతున్నది..? తమ జట్టు ఏ ఆటగాడిని తీసుకోబోతున్నది..? అని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్న నేపథ్యంలో..  

టీమిండియా అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ వేయి కండ్లతో వేచి చూస్తున్న సమయం ఆసన్నమైంది.  భారత క్రికెట్  కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం మరో పది రోజుల్లో (ఫిబ్రవరి 12, 13 తేదీలలో)  బెంగళూరు వేదికగా  ప్రారంభం కాబోతున్నది. రెండ్రోజుల పాటు జరిగే ఈ  కార్యక్రమంలో తమకు ఇష్టమైన ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ దక్కించుకోబోతున్నది..? తమ జట్టు ఏ ఆటగాడిని తీసుకోబోతున్నది..? అని అభిమానులు  వేచి చూస్తుండగా.. అదే సమయంలో ఏ ఏ ఆటగాడిని ఎలా దక్కించుకోవాలో ఫ్రాంచైజీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.   ఈ నేపథ్యంలో గతేడాది కొత్త ఐపీఎల్ జట్ల బిడ్ ల నుంచి నిన్నటి  ఐపీఎల్ వేలం జాబితా,  తదుపరి షెడ్యూల్ వరకు కూలంకషంగా... 

గత సీజన్ లో 8 జట్లతోనే సాగిన ఐపీఎల్ లో ఈ దఫా మరో రెండు ఫ్రాంచైజీలు చేరాయి. గతేడాది అక్టోబర్ లో బీసీసీఐ.. దుబాయ్ వేదికగా కొత్త ఫ్రాంచైజీల బిడ్ ల వేలాన్ని నిర్వహించింది. ఇందులో లక్నో తరఫున ఆర్ఫీఎస్జీ గ్రూపు సంస్థల అధినేత  సంజీవ్ గొయెంకా  లక్నో ఫ్రాంచైజీ (లక్నో సూపర్ జెయింట్స్) ను గెలుచుకోగా.. అహ్మదాబాద్ ను  సీవీసీ క్యాపిటల్స్ దక్కించుకున్నాయి. కొద్దిరోజుల  క్రితమే ఈ జట్లకు  లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా దక్కడంతో ఆ జట్లు..  ముగ్గురు ఆటగాళ్ల చొప్పున  ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. 

గతేడాది డిసెంబర్ లో జరిగిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో  పాత 8 జట్లు  ఈ కింది ప్లేయర్లను  రిటైన్ చేసుకున్నాయి. 

 

1. చెన్నై సూపర్ కింగ్స్ : రవీంద్ర జడేజా (రూ. 16 కోట్లు),  ఎంఎస్ ధోని (రూ. 12 కోట్లు), మోయిన్ అలీ (రూ. 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ. 6 కోట్లు)
2. ఢిల్లీ క్యాపిటల్స్ : రిషభ్ పంత్ (రూ. 16 కోట్లు), అక్షర్ పటేల్ (రూ. 12 కోట్లు),  పృథ్వీ షా (రూ. 8 కోట్లు), ఆన్రిచ్ నోర్త్జ్ (రూ. 6 కోట్లు)
3. కోల్కతా నైట్ రైడర్స్ :  ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 8కోట్లు),  వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు), సునీల్ నరైన్ (రూ. 6 కోట్లు)
4. ముంబై ఇండియన్స్ :  రోహిత్ శర్మ  (రూ. 16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 6 కోట్లు),  కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు)
5. పీబీకేఎస్ : మయాంక్ అగర్వాల్ (రూ. 12 కోట్లు), అర్షదీప్ సింగ్ (రూ. 4 కోట్లు)
6. రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (రూ. 14 కోట్లు), జోస్ బట్లర్ (రూ. 10 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ. 4 కోట్లు)
7.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి (రూ. 15 కోట్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (రూ.11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ. 7 కోట్లు)
8. సన్ రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ (రూ. 14 కోట్లు)  అబ్దుల్ సమద్ (రూ. 4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 4 కోట్లు)
9. లక్నో సూపర్ జెయింట్స్ : కెఎల్ రాహుల్  (రూ. 17 కోట్లు), మార్కస్ స్టాయినిస్ (రూ. 9.2 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ. 4 కోట్లు)
10. అహ్మదాబాద్ : హార్ధిక్ పాండ్యా (రూ. 15 కోట్లు), రషీద్ ఖాన్ (రూ.  15  కోట్లు), శుభమన్ గిల్ (రూ. 8 కోట్లు) 

వేలంలో  590 మంది..

వివిధ దేశాల నుంచి వచ్చిన 1,214 ప్లేయర్ల జాబితాను కాచి వడబోచింది బీసీసీఐ. ఈ జాబితా నుంచి  590 మంది ఆటగాళ్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ 590 మందిలో 228 మంది క్రికెటర్లు  క్యాప్డ్ (ఏదైనా దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నవారు)  ప్లేయర్లు కాగా 355 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు(ఇంతవరకు జాతీయ జట్టుకు ఆడనివాళ్లు). ఏడుగురిని అసోసియేట్ నేషన్స్ నుంచి తీసుకున్నారు. మొత్తం 590 మంది ఆటగాళ్లలో భారత క్రికెటర్లే 370 (క్యాప్డ్, అన్ క్యాప్డ్) ఉన్నారు. 220 మంది విదేశాలకు చెందిన ఆటగాళ్లున్నారు. 

హయ్యస్ట్ బేస్ ప్రైస్ (అత్యధిక రిజర్వ్ ధర రూ. 2 కోట్లు) కేటగిరీలో ఉన్న భారత ఆటగాళ్లు (17 మంది)  : 

ఆర్. అశ్విన్, చాహల్, దీపక్ చాహర్, ధావన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్, భువనేశ్వర్ కుమార్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, రాబిన్ ఊతప్ప,ఉమేశ్ యాదవ్ 

 

ఇదే జాబితాలో ఉన్న విదేశీ స్టార్లు (31 మంది) ఉన్నారు. ఇక రూ. 1.5 కోట్ల రిజర్వ్ ప్రైస్  జాబితాలో 20 మంది క్రికెటర్లు ఉన్నారు.  కోటి రూపాయల రిజర్వ్ ధరలో 34 మంది ఉన్నారు.

ఏ ఏ దేశం నుంచి ఎంతమంది..? 

590 మంది ఆటగాళ్లలో భారత క్రికెటర్లే 370 మంది ఉండగా.. మిగిలిన 220 మందిలో ఈ దేశాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లున్నారు. వారిలో అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి 47 మంది ఉన్నారు. ఇక  ఆ తర్వాత జాజితాలో వెస్టిండీస్ (34), సౌతాఫ్రికా (33), ఇంగ్లాండ్ (24), న్యూజిలాండ్ (24), ఆఫ్గానిస్థాన్ (17), బంగ్లాదేశ్ (5), ఐర్లాండ్ (5), శ్రీలంక (23), జింబాబ్వే (1), నమీబియా (3), నేపాల్ (1), స్కాట్లాండ్ (2), యూఎస్ఎ (1) ల నుంచి ఉన్నారు.

ఎంత ఖర్చు పెట్టొచ్చు..? ఫ్రాంచైజీల ఖాతాల్లో ఇంకా ఎంతుంది..? 

ఐపీఎల్-15 కోసం ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలకు  రూ. 90 కోట్ల లిమిట్ ఉంది. ఇప్పటికే కుదిరిన ఒప్పందాలు పోను ఆయా జట్లలో మిగిలిన  డబ్బు ఎంత ఉందంటే..

సీఎస్కే (రూ. 48 కోట్లు), ఢిల్లీ (రూ .47.5 కోట్లు), కేకేఆర్ (రూ. 48 కోట్లు), ముంబై (రూ  48  కోట్లు), పంజాబ్ (రూ. 72 కోట్లు), రాజస్థాన్ (రూ. 62 కోట్లు), ఆర్సీబీ (రూ. 57  కోట్లు),  హైదరాబాద్ (రూ. 68 కోట్లు), లక్నో (రూ. 59 కోట్లు), అహ్మదాబాద్ (రూ. 52 కోట్లు) 

మార్చి 27 నుంచి ఐపీఎల్..? 

గత రెండు  సీజన్లను దుబాయ్  నిర్వహించిన బీసీసీఐ.. ఈ సీజన్ ను మాత్రం ఇండియాలోనే నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా ఈ టోర్నీని తమ దేశంలో నిర్వహించాలని దుబాయ్ తో పాటు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు బీసీసీఐకి ప్రతిపాదనాలు పెట్టాయి. అయితే ఇందుకు బీసీసీఐ సుముఖంగా లేదు. దేశంలో కరోనా థర్డ్ వేవ్ గా భావిస్తున్న వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతున్నది.  గత వారం రోజులుగా కేసులలో  తగ్గుదల కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో భారత్ లో నిర్వహించేందుకే బీసీసీఐ మొగ్గు చూపుతున్నది. మహారాష్ట్ర, గుజరాత్ లలోని ఎంపిక చేసిన నాలుగు వేదికలలో  ఐపీఎల్ నిర్వహించేందుకు  శాయశక్తులా కృషి చేస్తున్నది. అన్నీ కుదిరితే మార్చి 27 నుంచి ఐపీఎల్ మొదలవడం ఖాయమే.. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !