CSK vs SRH Highlights: చెన్నైతుషార్ దేశ్‌పాండే దెబ్బకు తుస్సుమన్న హైదరాబాద్..

By Mahesh Rajamoni  |  First Published Apr 29, 2024, 12:56 AM IST

CSK vs SRH Highlights: ఐపీఎల్ 2024 46వ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సీఎస్‌కే 78 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్ కు తోడుగా చెన్నై బౌలర్లు సూపర్ గా బౌలింగ్ చేసి హైదరాబాద్ ప‌త‌నాన్ని శాసించారు.
 


CSK vs SRH Highlights: ఐపీఎల్ 2024 46వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ ను చిత్తుగా ఓడించింది. చెన్నైలోని సొంత మైదానం ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 78 పరుగుల తేడాతో హైద‌రాబాద్ పై విజయం సాధించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఓవర్లు మొత్తం ఆడకుండానే 134 పరుగులకే పెవిలియ‌న్ చేరారు. హైదరాబాద్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

రుతురాజ్ గైక్వాడ్ సూప‌ర్ బ్యాటింగ్.. 

Latest Videos

ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలుత‌ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 54 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 98 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ 32 బంతుల్లో 52 ప‌రుగుల త‌న‌ ఇన్నింగ్స్ లో  7 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. 20 బంతులు ఎదుర్కొన్న శివమ్ దూబే నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివ‌ర‌లో ధోనీ 5 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లు పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌క‌పోవ‌డంతో 20 ఓవ‌ర్ల‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు 3 వికెట్లు కోల్పోయి 212 ప‌రుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, జయదేవ్ ఉనద్కత్ లు త‌లా ఒక వికెట్ తీసుకున్నారు.

హైదరాబాద్ ఫ్లాప్ షో.. 

తొలుత బౌలింగ్ లో పెద్ద‌గా ప్ర‌భావం  చూపని హైద‌రాబాద్ టీమ్.. బ్యాటింగ్ లోనూ పెద్ద ఇన్నింగ్స్ ఆడ‌కుండానే వ‌రుస‌గా ఆట‌గాళ్లు పెవిలియ‌న్ బాటప‌ట్టారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ ఫ్లాప్ షో తో 18.5 ఓవ‌ర్ల‌లో 134 పరుగులకు ఆలౌటైంది. ఐడెన్ మార్క్రామ్ జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 26 బంతుల్లో 32 పరుగులు చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ మ్యాచ్‌లో సూప‌ర్ హిట్టింగ్ చేసిన బ్యాట్స్‌మెన్‌ ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ ఫ్లాప్‌ అయ్యారు. ఇద్దరూ వరుసగా 13, 15 పరుగులు చేశారు. జట్టులోని ఇతర బ్యాట్స్‌మెన్‌లు కూడా తక్కువ ప‌రుగుల‌కే ఔటవడంతో హైదరాబాద్ కు ఓట‌మి త‌ప్ప‌లేదు.

అద‌ర‌గొట్టిన సీఎస్కే బౌల‌ర్లు.. తుషార్ దేశ్ పాండే దెబ్బ‌కొట్టాడు

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తుషార్ దేశ్‌పాండే అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 4 బ్యాట్స్‌మెన్‌లను పెవిలియ‌న్ కు పంపాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ 2.5 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు ముఖ్యమైన వికెట్లు కూడా పడగొట్టాడు. రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌లకు చెరో వికెట్ దక్కింది. యార్కర్ స్పెషలిస్ట్ మతిషా పతిరనాకు 2 వికెట్లు ద‌క్కాయి. 

టాప్-4లో సీఎస్కే.. 

ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. చెన్నై ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడగా, అందులో ఐదింటిలో గెలిచి నాలుగింటిలో ఓడింది. చెన్నై సూపర్ కింగ్స్‌కు 10 పాయింట్లు ఉన్నాయి. హైదరాబాద్ నాలుగో ఓటమిని చవిచూసింది. హైదరాబాద్ జట్టు 9 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, 4 ఓటములతో నాలుగో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు 9 మ్యాచ్‌లలో 8 విజ‌యాల‌తో 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

గుజ‌రాత్ ను చెడుగుడు ఆడుకున్నాడు భ‌య్యా.. 6 6 4 6 6.. విల్ జాక్స్ విధ్వంసంతో రెండు ఓవ‌ర్ల‌లోనే 57 ప‌రుగులు

click me!