చెన్నై‌కి మరో ఎదురు దెబ్బ: ఐపీఎల్‌ నుంచి వైదొలగిన హర్భజన్

By Siva KodatiFirst Published Sep 4, 2020, 4:41 PM IST
Highlights

రైనా నిష్క్రమణ, కోవిడ్ కేసులతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 13 సీజన్‌కు తాను ఆడటం లేదని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రకటించాడు

రైనా నిష్క్రమణ, కోవిడ్ కేసులతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 13 సీజన్‌కు తాను ఆడటం లేదని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రకటించాడు.

గత కొద్దిరోజులుగా తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని.. అందువల్ల ఆమె దగ్గరే ఉండాలని భజ్జీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు హార్భజన్ సింగ్ స్థానాన్ని భర్తీ చేసే స్పిన్నర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ అన్వేషిస్తోంది.

స్పిన్ విభాగంలో భజ్జీ స్థానాన్ని ఇమ్రాన్ తాహిర్ భర్తీ చేస్తాడని భావిస్తున్నారు. సీఎస్‌కే హార్భజన్ తర్వాత తాహీర్ చెప్పుకోదగ్గ స్పిన్నర్ . మరోవైపు చెన్నైతో తాహిర్ ఇంకా కలవలేదు. ప్రస్తుతం సీపీఎల్‌లో ఆడుతున్న తాహిర్ ఈ నెల 10 వరకు అక్కడ బిజీగా ఉంటాడు. ఆ తర్వాతే యూఏఈ చేరుకుని చెన్నై సూపర్ కింగ్స్‌ను కలవనున్నాడు.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. ఆగస్టు 20న యూఏఈకి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ చేరుకుంది.

అయితే జట్టుతో కలిసి కాకుండా తాను విడిగా సెప్టెంబర్ 1 నాటికి యూఏఈకి వస్తానని హార్భజన్ చెప్పాడు. సుదీర్ఘకాలం ముంబయి ఇండియన్స్ టీమ్‌కి ఆడిన హర్భజన్ సింగ్.. 2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు

click me!