ఐపీఎల్‌ను వెంటాడుతున్న విఘ్నాలు.. ఇప్పుడు అంపైర్ల వంతు: తలపట్టుకున్న బీసీసీఐ

By Siva KodatiFirst Published Sep 4, 2020, 2:44 PM IST
Highlights

ఎన్నో అవాంతరాలను దాటుకుని ఐపీఎల్‌ను  నిర్వహించాలని గట్టి పట్టుదలగా ఉన్న బీసీసీఐని గండాలు వదలడం లేదు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో క్రికెటర్లకు, సహాయక సిబ్బందికి పాజిటివ్‌గా తేలడంతో ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి

ఎన్నో అవాంతరాలను దాటుకుని ఐపీఎల్‌ను  నిర్వహించాలని గట్టి పట్టుదలగా ఉన్న బీసీసీఐని గండాలు వదలడం లేదు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో క్రికెటర్లకు, సహాయక సిబ్బందికి పాజిటివ్‌గా తేలడంతో ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా అంపైర్ల విషయంలో మరో సవాల్ ఎదురైంది.

యూఏఈ వేదికగా ఈ నెల 19 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్‌లో విధులు నిర్వర్తించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలైట్ ప్యానెల్‌కు చెందిన అంపైర్లు సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది.

ఐపీఎల్‌లో అంపైరింగ్ బాధ్యలు నిర్వర్తించాల్సిందిగా ఐసీసీ ఎలైట్ ప్యానెల్ సభ్యులను బీసీసీఐ కోరింది. వీరిలో కేవలం నలుగురు మాత్రంమే తమ సంసిద్ధతను వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో క్రిస్ గఫాని( న్యూజిలాండ్), రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లాండ్), మైఖేల్ గాఫ్ (ఇంగ్లాండ్‌), నితిన్ మీనన్ (భారత్) ఉన్నారు.

వ్యక్తిగత కారణాలతోనే ఈ ఏడాది ఐపీఎల్‌కు తాము దూరమవుతున్నామని అంపైర్లు చెబుతున్నప్పటికీ.. వాస్తవం మాత్రం కరోనానే అని తెలుస్తోంది. ఐపీఎల్ ఆరంభం నుంచి అంపైరింగ్ విధులు నిర్వర్తిస్తున్న కుమార ధర్మసేన కూడా 13వ సీజన్‌కు దూరం కానున్నాడు.

శ్రీలంకలో జరిగే క్రికెట్ టోర్నీల కారణంగానే తాను ఐపీఎల్‌లో పాల్గొనలేకపోతున్నానని ధర్మసేన బీసీసీఐకి చెప్పాడు. కాగా ప్రతి సీజన్‌లోనూ ఎలైట్ ప్యానెల్‌కు చెందిన ఆరుగురు అంపైర్లను ఐపీఎల్ కోసం బీసీసీఐ తీసుకుంటూ వస్తోంది.

ఈ ఏడాది కరోనా కారణంగా లీగ్ సెప్టెంబర్‌కు వాయిదా పడటం.. అదే సమయంలో పెద్దగా టోర్నీలు లేకపోవడంతో ఎక్కువమంది అంపైర్లను యూఏఈ తీసుకురావాలని బీసీసీఐ భావించింది.

అయితే క్వారంటైన్, బయో సెక్యూర్ బబుల్ దాటి బయటకు వెళ్లకూడదనే నిబంధనలు ఉండటంతో ఐపీఎల్‌లో బాధ్యతలు నిర్వర్తించడంపై అంపైర్లు సుముఖంగా లేరు. వీరి నిర్ణయం దృష్ట్యా బీసీసీఐ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

ఐపీఎల్ కోసం కనీసం 15 మంది అంపైర్లు అవసరం. వీరిలో 12 మంది ఫీల్డ్, టీవీ అంపైర్లు కాగా, మరో ముగ్గురు ఫోర్త్ అంపైర్లుగా ఉంటారు. 

click me!