
నాయకుడు, ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గానే గాక విరాట్ కోహ్లి ప్రపంచంలోనే మేటి ఫిల్డర్లలో ఒకడు. మైదానంలో పాదరసంలా కదిలే కోహ్లి.. తన దగ్గరికి బంతి వచ్చిందంటే దానికి అడ్డుగోడ పడినట్టే లెక్క. ఇక ఎంత క్లిష్టమైన క్యాచ్ నైనా అవలీలగా అందుకునే కోహ్లి.. శుక్రవారం రాత్రి షార్జా స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మరో అద్భుతమైన ఫీట్ చేశాడు. సీఎస్కే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇచ్చిన క్యాచ్ ను ముందుకు డైవ్ చేస్తూ పట్టిన విధానం అక్కడి అభిమానులనే గాక నెటిజన్లు ఆకట్టుకుంది.
బెంగళూరు నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెలరేగి ఆడుతున్న గైక్వాడ్.. చాహల్ వేసిన తొమ్మిదో ఓవర్లో బంతిని తక్కువ ఎత్తులోనే గాల్లోకి లేపాడు. అవకాశమే లేని చోట.. కోహ్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ క్యాచ్ ను అందుకున్నాడు. ముందుకు డైవ్ చేసే సమయంలో.. ఏదైనా జంతువును వేటాడేప్పుడు చిరుత పులి దానిపై లంఘించి దునికినట్టు బంతిని ఒడిసిపట్టాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గైక్వాడ్ నిష్క్రమణ చెన్నై ఫలితాన్ని మార్చలేదు. కానీ కోహ్లి ఫీట్ మాత్రం అతడి అభిమానులను విశేషంగా అలరించింది.
ఇదిలాఉండగా బెంగళూరు ఓపెనర్లు రాణించినా మిడిల్ ఆర్డర్ వైఫల్యం, పేలవ బౌలింగ్ కారణంగా ఆర్సీబీ వరుసగా రెండో మ్యాచ్ లోనూ పరాజయం మూటగట్టకున్నది.