లోపలికి ఎవరూ వచ్చేదిలే.. బయిటకు వెళ్లేదిలే.. అంతా హోటల్లోనే.. సౌతాఫ్రికాలో టీమిండియాకు హై ఫై భద్రత

By Srinivas MFirst Published Dec 10, 2021, 5:00 PM IST
Highlights

India Tour Of South Africa: దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చే టీమిండియా ఆటగాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటామని సీఎస్ఏ.. బీసీసీఐకి హామీ ఇచ్చింది. ఆఫ్రికాకే తలమానికంగా నిలిచిన అత్యంత విలాసవంతమైన హోటల్ ను భారత జట్టు కోసం బుక్ చేసింది. 

ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటన ఉంటుందా..? ఉండదా..? అని సంశయించిన ఆ దేశానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. వారం ఆలస్యంగా అయినా టూర్ కు వస్తామని  క్రికెట్ సౌతాఫ్రికాకు చెప్పిన బీసీసీఐ.. ఆ మేరకు టెస్టు జట్టును కూడా ప్రకటించింది. అయితే ఆటగాళ్ల భద్రత, ఆరోగ్యం విషయంలో మాత్రం తమకు పూర్తి గ్యారెంటీ ఇవ్వాలని కోరడంతో దక్షిణాఫ్రికా దానికి అంగీకారం తెలిపింది.  పర్యటనకు వచ్చే టీమిండియా ఆటగాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటామని బీసీసీఐకి హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆఫ్రికాకే తలమానికంగా నిలిచిన హోటల్ ను భారత జట్టు కోసం బుక్ చేసింది. 

కరోనా వైరస్ నేపథ్యంలో కఠినమైన బయో బబుల్  నిబంధనలను పాటిస్తూ పర్యటనను జరుపుతామని బీసీసీఐకి హామీ ఇచ్చిన సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ).. ఆఫ్రికా ఖండంలోనే ప్రఖ్యాతమైన ఐరీన్ కంట్రీ లాడ్జ్ (Irene Country Lodge) నే బుక్ చేసింది. సిరీస్ ముగిసేసరికి భారత ఆటగాళ్లతో పాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ఈ హోటల్ లోనే ఉంటారు. 

క్రికెటర్లే కాదు.. సిరీస్ జరిగినన్ని రోజులు ఈ హోటల్ నుంచి ఈగ బయటకు వెళ్లాలన్నా స్కానింగ్ చేసి వెళ్లేలా అక్కడ భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేసింది సీఎస్ఏ. ఈ మేరకు ఆ హోటల్ కు పలు కీలక ఆదేశాలను కూడా  జారీ చేసింది. అవేంటంటే... 

1. బయటివ్యక్తులు లోపలికి రావడానికి వీలులేదు. 
2. హోటల్ లోని సిబ్బందిని క్వారంటైన్ లో ఉంచాలి. (ఇప్పటికే ఆ హోటల్ లో పనిచేసేవాళ్లు క్వారంటైన్ లో ఉంటున్నారు) స్టాఫ్ అందరికీ రోజూ కరోనా పరీక్షలు నిర్వహించాలి. 
3. ఈ హోటల్ కు సంబంధించిన ప్రతి వస్తువు ఆరోగ్య, భద్రతా పరీక్షలను పరీక్షించాకే లోపలికి అనుమతించాలి. 
4. హోటల్ లో కొవిడ్-19 ను పర్యవేక్షించేందుకు వైద్య, ఆరోగ్య అధికారులను నియమించాలి. (ఈ ప్రక్రిమను కూడా హోటల్  అమలుచేస్తున్నది) 
5. కరోనా వ్యాప్తి జరుగకుండా ఉండేందుకు వీలుగా హోటల్ ను వివిధ విభాగాలుగా విభజించారు. 

బయో బబుల్ లో జరిగే  ఈ సిరీస్ కోసం సీఎస్ఏ పకడ్బందీగా మార్గదర్శకాలను పాటిస్తున్నది.  ఒక్క ఐరీన్ హోటల్ మాత్రమే కాదు.. దాని చుట్టు పక్కల ఉన్న పరిసరాలన్నింటిపైనా ఇప్పటికే నిఘా పెట్టింది. ఒక్క దక్షిణాఫ్రికా లోనే కాదు మొత్తం ఆఫ్రికా ఖండంలో అత్యంత విలాసవంతమైన హోటల్ గా గుర్తింపు ఉన్న ఈ హోటల్ లో ఆటగాళ్ల భద్రతకు ఎలాంటి ముప్పు లేకుండా బోర్డు పర్యవేక్షిస్తున్నది. 

ఒక్క భారత్ తో సిరీస్ కే  కాదు.. గతంలో శ్రీలంక, పాకిస్థాన్ తో సిరీస్ లు నిర్వహించినప్పుడు కూడా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు.. ఐరీన్ హోటల్ లోనే వారికి ఆతిథ్యమిచ్చింది. 

కాగా.. ఈ నెల 12న భారత జట్టు దక్షిణాఫ్రికా కు బయల్దేరే అవకాశమున్నట్టు బీసీసీఐ వర్గాల సమాచారం. డిసెంబర్ 26-30 మధ్య సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరుగనుండగా.. జనవరి 3-7 మధ్య జోహన్నస్బర్గ్ లో రెండో టెస్టు నిర్వహించనున్నారు. మూడో టెస్టు కేప్ టౌన్ లో 11-15 మధ్య జరుగుతుంది. ఇది భారత టెస్టు సారథి విరాట్ కోహ్లీకి వందో టెస్టు కానుండటం గమనార్హం. ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును కూడా ప్రకటించింది. 

click me!