
పరిమిత ఓవర్ల క్రికెట్ కు పూర్తిస్థాయి సారథిగా బాధ్యతలు చేపట్టిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వన్డేలలో విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీని కాదని మరీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దక్షిణాఫ్రికా పర్యటనకు రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. హిట్ మ్యాన్ కు పలు సూచనలు చేశాడు. అనవసర విషయాలకు స్పందించకుండా ఉంటేనే రోహిత్.. విజయవంతమైన నాయకుడిగా ఎదుగుతాడని సూచించాడు.
రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ దేనికి భయపడడు. ప్రతిసారి అతడు జట్టుకు ఏది అవసరమో అది చేస్తాడు. అతడు అనవసర విషయాలకు స్పందించాల్సిన అవసరం లేదు. పరిస్థితులను బట్టి జట్టుకు ఏది అవసరమో అది చేస్తూ ముందుకు సాగాలి. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిని సమర్థంగా ఉపయోగించుకుంటేనే అతడు విజయవంతమైన సారథిగా రాణించగలుగుతాడు...’ అని హిట్ మ్యాన్ కు సూచించాడు.
రెండ్రోజుల క్రితమే భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ కు రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమిస్తున్నట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ లో కూడా రోహిత్ కు మంచి రికార్డే ఉంది
ఇప్పటివరకు 32 మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించిన అతడు.. 26 మ్యాచులలో భారత్ కు విజయాలు అందించాడు. రోహిత్ నాయకత్వంలోనే భారత్.. నిదాహస్ ట్రోఫీ, 2018 లో ఆసియా కప్ లో విజయం సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా అత్యంత విజయవంతమైన నాయకుడు రోహితే. అతడి సారథ్యంలోనే ముంబై ఇండియన్స్ ఐదు సార్లు ట్రోఫీ నెగ్గింది.
ఇక రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ పై కూడా రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. విరాట్ సమర్థవంతమైన ఆటగాడని కొనియాడాడు. అతడు సాధించిన రికార్డులను ఎవరూ పెద్దగా పట్టించుకోరని, కెప్టెన్ గా అతడు సాధించిన విజయాల ఆధారంగానే గౌరవిస్తుంటారని తెలిపాడు. టీమిండియా సారథిగా ఉండటమనేది మాములు విషయం కాదని, కోహ్లీ సాధించిన విజయాల పట్ల గర్వపడాలని వ్యాఖ్యానించాడు.