హార్ట్ ఎటాక్.. క్రికెట్‌పై తగ్గని ప్రేమ: గ్రౌండ్‌లోనే కుప్పకూలిన క్రికెటర్

By Siva KodatiFirst Published Nov 18, 2019, 4:34 PM IST
Highlights

ప్రమాదవశాత్తు బంతి తగలడం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోగా.. ఎంతోమంది తీవ్రగాయాల పాలై ఆటకు దూరమైన సంఘటనలు ఎన్నో. తాజాగా ఓ క్రికెటర్‌ మైదానంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి క్రికెట్‌లో అప్పుడప్పుడు విషాదకర ఘటనలు జరుగుతుంటాయి. ప్రమాదవశాత్తు బంతి తగలడం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోగా.. ఎంతోమంది తీవ్రగాయాల పాలై ఆటకు దూరమైన సంఘటనలు ఎన్నో. తాజాగా ఓ క్రికెటర్‌ మైదానంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెళితే.. గుడిమల్కాపూర్‌ బాలాజీనగర్‌కు చెందిన వీరేందర్ నాయక్ హెచ్ఎస్‌బీసీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరేందర్‌కు క్రికెట్ అంటే పిచ్చి.. సెలవు దినాల్లో పలు టోర్నమెంట్లలో పాల్గొనేవారు. అయితే ఆయనకు రెండు నెలల క్రితం గుండెపోటు రావడంతో వైద్యం చేయించుకుంటున్నారు.

క్రికెట్‌కు దూరంగా ఉండాలని.. లేదంటే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు సూచించారు. అయినప్పటికీ క్రికెట్‌పై ఉన్న ప్రేమతో ఈ ఆదివారం ఈస్ట్ మారేడ్‌పల్లిలోని జీహెచ్ఎంసీ మైదానంలో ఎంపీ స్పోర్టింగ్, ఎంపీ బ్ల్యూస్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ఎంపీ బ్ల్యూస్ జట్టు తరపున బరిలోకి దిగాడు.

Also read:తమ్ముడు కొట్టిన షాట్‌.. అన్న ముక్కు పంక్చర్

రెండు గంటల పాటు ఓపికగా బ్యాటింగ్ చేసిన అతను 55 పరుగులు చేసి ఔటై పెవిలియన్‌కు చేరుకున్నాడు. అనంతరం బయటకి వచ్చి కొంతసేపు కుర్చీలో కూర్చొన్నారు.

మూత్ర విసర్జన కోసం కుర్చీలోంచి లేచి రెండు అడుగులు వేసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన తోటి క్రీడాకారులు ఆయనను సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించగా.. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. 

మరో ఘటనలో తమ్ముడు కొట్టిన షాట్‌కు అన్న గాయపడిన సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మార్ష్ వన్డే కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్టన్ అగర్.. తమ్ముడు వెస్ అగర్ షాట్‌ను క్యాచ్ పట్టుకునే క్రమంలో గాయపడ్డాడు. సౌత్ ఆస్ట్రేలియా తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఆగర్ బ్యాటింగ్ చేస్తున్నాడు.

Also Read:బంగ్లాతో రెండో టెస్ట్.. ఈడెన్ హౌస్‌ఫుల్: విరాట్ కోహ్లీని గ్రేట్ అన్న గంగూలీ

ఇదే సమయంలో 41వ ఓవర్‌లో మార్కస్ స్టోయినిస్ వేసిన బంతిని అతను మిడ్ వికెట్ మీదుగా షాట్ కొట్టగా అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఆస్టన్ దానిని అందుకోవడానికి యత్నించాడు. ఈ క్రమంలో బంతి కాస్త జారడంతో కనుబొమ్మల మధ్య నుదిటి భాగంలో తగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది.

దీంతో రక్తంతో తడిసిన ముఖంతో ఆగర్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని విడిచి వెళ్లిపోయాడు. గాయం కారణంగా అతను టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రమాదం ఏమి లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు

click me!