ముగిసిన రాహుల్ ద్రావిడ్ పదవీకాలం... కొత్తవారి కోసం దరఖాస్తుల ఆహ్వానం...

By Chinthakindhi RamuFirst Published Aug 11, 2021, 11:39 AM IST
Highlights

ఎన్‌సీఏ డైరెక్టర్‌గా రాహుల్ ద్రావిడ్ రెండేళ్ల కాంట్రాక్ట్ పూర్తి...

భారత ప్రధాన కోచ్ పదవిపై రాహుల్ ద్రావిడ్ ఆసక్తి?

జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసింది. భారత అండర్-19, ఇండియా- ఏ జట్లకి కోచ్‌గా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, రెండేళ్లుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా బాధ్యతలు చేపడుతున్నారు...

భారత జట్టులో గాయపడిన క్రికెటర్లను తిరిగి జట్టులోకి వచ్చేలా శిక్షణ ఇవ్వడంతో పాటు యువ క్రికెటర్లలోని టాలెంట్‌ను గుర్తించి, వారిని భారత జట్టు అవసరాలకి అనుగుణంగా తీర్చిదిద్దడమే జాతీయ క్రికెట్ అకాడమీ ప్రధాన ఉద్దేశం.

ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టిన శార్దూల్ ఠాకూర్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ... ఇలా చాలామంది ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుని, రాటుతేలినవాళ్లే. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉంటూనే శ్రీలంక టూర్‌కి భారత జట్టు ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు రాహుల్ ద్రావిడ్.

ఈ పర్యటనలో వన్డే సిరీస్‌ను నెగ్గిన టీమిండియా, ప్రధాన ఆటగాళ్లు కరోనా కారణంగా దూరం కావడంతో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ద్రావిడ్ పదవీకాలం ముగిసినా, ఆయనకి ఆసక్తి ఉంటే మరోసారి ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుత భారత కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ టీ20 వరల్డ్‌కప్ 2021తో ముగియనుంది.

ఆయన తర్వాత భారత జట్టు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపడతారని టాక్ నడుస్తోంది. ఒకవేళ రాహుల్ ద్రావిడ్ ఎన్‌సీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకుంటే... ఆయన భారత జట్టు కోచ్‌గా నియమితం అయ్యేదాకా ఆ పదవిలో కొనసాగుతారు.

click me!