మహేంద్ర సింగ్ దోనికి అరుదైన గౌరవం దక్కింది. ఆయన ధరించిన జెర్సీ నెంబర్ 7ను రిటైర్ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. సచిన్ టెండూల్కర్ జెర్సీ నెంబర్ 10ను మరే ఆటగాడికి కేటాయించలేదు. యువ ఆటగాళ్లు ఎంచుకునే నెంబర్ల జాబితా నుంచి నెంబర్ 10ను తొలగించారు. తాజాగా, నెంబర్ 7ను కూడా రిటైర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
MS Dhoni: జెర్సీ నెంబర్ 10, జెర్సీ నెంబర్ 7లు కనిపించగానే.. ఆ జెర్సీలు ధరించిన ఆటగాళ్లు చప్పున గుర్తుకు వస్తారు. ఈ రెండు జెర్సీలను భారత క్రికెట్ అభిమానులు అంత సులువుగా మరచిపోరు. టీమిండియా చరిత్రలో వారి పేర్లు సుస్థిరం. సచిన్ టెండూల్కర్ అందించిన సేవలకు గుర్తింపుగా జెర్సీ నెంబర్ 10ను ఆయనకే అంకితం ఇచ్చారు. కొత్తగా వచ్చే మరే ఆటగాడికి ఆ జెర్సీ నెంబర్ దొరకదు. ఇప్పుడు అదే గౌరవం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కూడా దక్కింది. మహేంద్ర సింగ్ ధోని ధరించిన జెర్సీ నెంబర్ 7 మరెవరికీ దక్కదు. కొత్తగా వచ్చే ఆటగాళ్లకు ఆ నెంబర్‌ను అందుబాటులో ఉంచడం లేదు. ఈ జెర్సీ నెంబర్ 7ను రిటైర్ చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
ధోనికి ఇప్పటికీ క్రికెట్ అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే ధోని బ్యాట్, ధోని జెర్సీ.. ఇలా ఆయనకు సంబంధించిన వాటిని ప్రత్యేకంగా ఆరాధిస్తుంటారు. ముఖ్యంగా జెర్సీ నెంబర్ 7ను ఒక ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు. జెర్సీ నెంబర్ 7ను సాక్షాత్తు ధోనిలాగానే భావిస్తారు. ధోని ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఆయన టీమిండియాకు అందించిన సేవలకు గుర్తింపుగా జెర్సీ నెంబర్ 7ను కూడా బీసీసీఐ రిటైర్ చేయాలని నిర్ణయించింది. ఇకపై జెర్సీ నెంబర్ 7 మరే ఆటగాడికి దక్కదు.
సాధారణంగా ఇండియా టీంలోకి వచ్చేటప్పుడు ఆ ఆటగాడిని 1 నుంచి 100 అంకెల మధ్య ఏ నెంబర్‌నైనా ఎంచుకోమంటారు. జెర్సీ నెంబర్ 7ను ఎంచుకోరాదని యువ ఆటగాళ్లకు బీసీసీఐ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇక టెండూల్కర్‌కు చెందిన నెంబర్ 10ను 2017లోనే ఈ జాబితా నుంచి తొలగించినట్టు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
Also Read: Telangana Assembly: మల్లారెడ్డి గూగ్లీ.. ‘అవసరమైతే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తా’.. మాది పాల‘కులం’
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన వారి జెర్సీ నెంబర్లనే యువ ఆటగాళ్లు ఎంచుకోవడానికి అందుబాటులో ఉంచుతున్నారు. టీమ్‌లో ఆడి ఒకట్రెండు సంవత్సరాలు ఆడకుండా బ్రేక్‌లో ఉన్నా.. వారి జెర్సీ నెంబర్లను కొత్త వారు ఎంచుకోవడానికి అవకాశం ఇవ్వదు. దీంతో ఇప్పుడు కొత్తగా టీమ్‌లోకి వచ్చే వారికి ఎంచుకోవడానికి సుమారు 30 నెంబర్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు బీసీసీఐకి చెందిన మరో అధికారి వివరించారు.
యంగ్ ఇండియన్ ఒపెనర్ యశస్వి జైస్వాల్ తనకు 19 నెంబర్ జెర్సీ కావాలని కోరాడు. కానీ, ఆ నెంబర్‌ను దినేశ్ కార్తిక్ ఉపయోగిస్తున్నాడు. ఆయన ఇంకా రిటైర్ కాలేదు. కాబట్టి, యశస్వి జైస్వాల్ 64 నెంబర్‌కు ఫిక్స్ కావాల్సి వచ్చింది.