T20 World Cup 2024, AUS vs ENG : టీ20 ప్రపంచ కప్ 2024 లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు ఆస్ట్రేలియా బిగ్ షాకిచ్చింది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 36 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను కంగారుల టీమ్ మట్టికరిపించింది.
T20 World Cup 2024, AUS vs ENG : టీ20 ప్రపంచ కప్ 2024 17వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను ఆస్ట్రేలియా ఓడించింది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్యాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపా సూపర్ బౌలింగ్‌తో కంగారూ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. జంపా 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ప్యాట్ కమ్మిన్స్ 4 ఓవర్ల బౌలింగ్ లో 23 పరుగులిచ్చి రెండు వికెట్టు పడగొట్టాడు. కీలక సమయంలో ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ వికెట్లు పడగొట్టి జంపా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
కలిసికట్టుగా రాణించిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్
undefined
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోష్ బట్లర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచ్ లో ఏ బ్యాట్స్‌మెన్ కూడా 40 పరుగుల మార్కును అందుకోలేకపోయాడు, కానీ కలిసికట్టుగా ఆడి జట్టు స్కోర్ ను 200 పరుగుల మార్కును దాటించారు. చాలా మంది బ్యాట్స్‌మెన్ వేగంగా పరుగులు సాధించారు. డేవిడ్ వార్నర్ 16 బంతుల్లో 39 పరుగులు, మిచెల్ మార్ష్ 25 బంతుల్లో 35 పరుగులు, ట్రావిస్ హెడ్ 18 బంతుల్లో 34 పరుగులు, మార్కస్ స్టోయినిస్ 17 బంతుల్లో 30 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 2 వికెట్లు తీశాడు. మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్‌స్టోన్ లు తలా ఒక వికెట్ తీసుకున్నారు.
ఇంగ్లండ్ కు మంచి ఆరంభం లభించినా..
202 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. బట్లర్, సాల్ట్ 7.1 ఓవర్లలో 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జంపా తన మొదటి బంతికే సాల్ట్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే బట్లర్ 28 బంతుల్లో 42 పరుగులు చేసి జంపా బౌలింగ్ లోనే ప్యాట్ కమిన్స్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పట్టాలు తప్పింది. విల్ జాక్వెస్ 10, జానీ బెయిర్‌స్టో 7, మొయిన్ అలీ 25, లివింగ్‌స్టోన్ 15 పరుగులు చేసి ఔట్ అయ్యారు. హ్యారీ బ్రూక్ 20 పరుగులతో, జోర్డాన్ 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. 20 ఓవర్లలో ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్సోయి కేవలం 165 పరుగులు మాత్రమే చేయగలిగింది.
గ్రూప్ బీ లో కంగారులకు టాప్ స్థానం
ఈ విజయంతో గ్రూప్-బీలో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్ లోకి చేరుకుంది. ఆడిన 2 మ్యాచ్‌ల్లో విజయంతో 4 పాయింట్లు సాధించింది. ఇక ఇంగ్లండ్ 2 మ్యాచ్‌ల్లో 1 పాయింట్‌తో నాలుగో స్థానానికి పడిపోయింది. సూపర్-8కి చేరుకోవాలంటే, ఇప్పుడు దాని మిగిలిన 2 మ్యాచ్‌లలో ఒమన్, నమీబియాపై భారీ స్కోర్ తేడాతో విజయాలు సాధించాలి. స్కాట్లాండ్ 2 మ్యాచ్‌ల్లో 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నమీబియా 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఒమన్ ఖాతా తెరవలేదు.