SA vs NED highlights : టీ20 ప్రపంచకప్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్. 'కిల్లర్ మిల్లర్' సూపర్ షో తో అదరగొడుతూ నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాకు సూపర్ విక్టరీని అందించాడు.
SA vs NED highlights : టీ20 ప్రపంచ కప్ 2024 16వ మ్యాచ్ లో నెదర్లాండ్స్ vs దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. డేవిడ్ మిల్లర్ టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడి సౌతాఫ్రికాకు విజయాన్ని అందించాడు. 'మిల్లర్, కిల్లర్ సూపర్ షో తో టీ20 ప్రపంచ కప్ 2024లో ప్రొటీస్ జట్టు పరాజయం నుంచి తృటిలో తప్పించుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠ పోరులో నెదర్లాండ్స్ జట్టు విజయం సాధించలేకపోయింది. 'కిల్లర్-మిల్లర్' గా గుర్తింపు సాధించిన ప్రొటీస్ జట్టు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ తన తుఫాను ఇన్నింగ్స్‌తో మెరిశాడు. దీంతో టోర్నీలో ఆఫ్రికన్ జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.
న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని క్లిష్ట పిచ్‌పై మరోసారి ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్‌తో ఆఫ్రికా జట్టు 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 106 పరుగులు చేసి విజయం సాధించింది. మిల్లర్ 51 బంతుల్లో 59 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. సిక్సర్ కొట్టి మ్యాచ్ ముగించాడు.
కష్ట సమయంలో మిల్లర్ సూపర్ షో..
104 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన సౌతాఫ్రికా జట్టు 12 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్వింటన్ డి కాక్, కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ లు మరోసారి నిరాశపరిచారు. హెన్రిచ్ క్లాసెన్ 4 పరుగులు, రీజా హెండ్రిక్స్ 3 పరుగులు చేసి అవుటయ్యారు. ఇక్కడి నుంచి ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ జట్టును ముందుకు నడిపించారు. ఆరంభంలో ఇద్దరూ నిదానంగా బ్యాటింగ్ చేసి వికెట్లు పడకుండా స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు.
సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించేసిన మిల్లర్
37 బంతుల్లో 33 పరుగులు చేసిన తర్వాత స్టబ్స్ ఔటయ్యాడు. దీంతో ఆఫ్రికా జట్టు 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కొంత సమయం తర్వాత మార్కో యాన్సెన్ (3) కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఇలాంటి కష్ట సమయంలో ఇక్కడి నుంచి మిల్లర్ జోరు చూపించి మ్యాచ్‌ను త్వరగా ముగించాడు. కేశవ్ మహరాజ్ 1 బంతిని ఎదుర్కొని ఖాతా తెరవకుండానే నాటౌట్‌గా నిలిచాడు. మిల్లర్ 18వ ఓవర్ ఐదో బంతికి బాస్ డి లీడేను సిక్సర్ కొట్టి సౌతాఫ్రికాకు విజయాన్ని అందించాడు. నెదర్లాండ్స్ తరఫున వివియన్ కిన్మా, లోగాన్ వాన్ బీక్ లు తలా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
ఒట్నీల్ బార్ట్‌మాన్ అద్భుత బౌలింగ్
దక్షిణాఫ్రికా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఒట్నీల్ బార్ట్‌మాన్ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అలాగే, ఎన్రిచ్ నార్కియా 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మార్కో యాన్సెన్ కూడా తుఫాను బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. నెదర్లాండ్స్ తరఫున సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ అత్యధికంగా 40 పరుగులు చేశాడు. వాన్ బీక్ 23 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో గ్రూప్-డీలో దక్షిణాఫ్రికా జట్టు 4 పాయింట్లతో మొదటి స్థానానికి చేరుకుంది. ఈ ఓటమి నెదర్లాండ్స్‌ను మూడో స్థానానికి నెట్టింది.
IND VS PAK మ్యాచ్ లో షాహీన్ అఫ్రిది VS రోహిత్ శర్మ బిగ్ ఫైట్ ను చూడాల్సిందే.. !