ఏషియన్ గేమ్స్ 2023: భారత్ ఖాతాలో రెండో స్వర్ణం... ఫైనల్‌లో లంకపై టీమిండియా ఘన విజయం..

By Chinthakindhi Ramu  |  First Published Sep 25, 2023, 3:12 PM IST

ఉమెన్స్ క్రికెట్ టీ20 టోర్నీ ఫైనల్‌లో భారత మహిళా జట్టు ఘన విజయం... ఫైనల్‌లో శ్రీలంకపై 19 పరుగుల తేడాతో నెగ్గి, పసిడి పతకం కైవసం.. 


ఏషియన్ గేమ్స్ 2023 టోర్నీలో భారత్ ఖాతాలో రెండో స్వర్ణం చేరింది. ఉమెన్స్ క్రికెట్ టీ20 టోర్నీ ఫైనల్‌లో భారత మహిళా జట్టు, శ్రీలంకపై 19 పరుగుల తేడాతో నెగ్గి, పసిడి పతకం గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది..

షెఫాలీ వర్మ 15 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసి అవుటైనా జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన కలిసి రెండో వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 45 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసిన స్మృతి మంధాన, రణవీర బౌలింగ్‌లో అవుటైంది.

Latest Videos

undefined

రిచా ఘోష్ ఓ సిక్సర్ బాది 9 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2, పూజా వస్త్రాకర్ 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. జెమీమా రోడ్రిగ్స్ 40 బంతుల్లో 5 ఫోర్లతో 42 పరుగులు చేసి అవుటైంది. 14.4 ఓవర్లు ముగిసే సమయానికి 89/1 స్కోరుతో ఉన్న భారత మహిళా జట్టు, 116/7 స్థితికి చేరుకుంది.

తొలి ఓవర్‌లోనే 13 పరుగులు రాబట్టిన శ్రీలంక మహిళా జట్టు, దూకుడుగా ఇన్నింగ్స్‌ని ఆరంభించింది. అనుష్క సంజీవని, విష్మి గుణరత్నేలను ఒకే ఓవర్‌లోనే అవుట్ చేసిన టిటాస్ సధు, లంకకు షాకిచ్చింది. 12 పరుగులు చేసిన కెప్టెన్ ఛమరీ ఆటపట్టు కూడా సధు బౌలింగ్‌లోనే అవుటైంది.

𝐆𝐎𝐋𝐃 🥇 𝐅𝐨𝐫 𝐈𝐍𝐃𝐈𝐀🇮🇳 beat Sri Lanka by 19 runs in the 2022 FINAL 🏏 pic.twitter.com/sOmzIWEUQR

— Doordarshan Sports (@ddsportschannel)

హసినీ పెరేరా 25, నిలాక్షి డి సిల్వ 23, ఓసాది రణసింగే 19, కవిశా దిల్హరి 5, సుగంధిక కుమారి 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు. భారత బౌలర్లలో టిటాస్ సధు 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. రాజేశ్వరి గౌక్వాడ్‌కి 2 వికెట్లు దక్కాయి. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, దేవికా వైద్య తలా ఓ వికెట్ తీశారు.  మొట్టమొదటిసారిగా ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన భారత మహిళా క్రికెట్ జట్టు, స్వర్ణం కైవసం చేసుకోవడం విశేషం. 

click me!