
India vs Pakistan Asia Cup 2025: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఆసియా కప్ 2025 గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ పోరు జరిగింది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. రెండు మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. పిచ్ నెమ్మదిగా ఉండడంతో స్పిన్‌కు అనుకూలించింది. దీంతో భారత్ పాక్ ను 127/9 పరుగులకే పరిమితం చేసింది.
ప్రారంభం నుంచే పాకిస్తాన్ బ్యాటింగ్ కష్టాల్లో పడింది. హార్దిక్ పాండ్యా తొలి ఓవర్‌లో అయూబ్‌ను డక్ గా పెవిలియన్‌కు పంపించారు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా ఓవర్‌లో మహ్మద్ హారిస్ కేవలం 3 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. వీరి తర్వాత క్రీజులోకి వచ్చిన సహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ కొద్దిసేపు భారత బౌలింగ్ ను ప్రతిఘటించాడు. ఫర్హాన్ బుమ్రా బౌలింగ్ లో రెండు సిక్స్‌లు బాదాడు. అయినప్పటికీ తొలి ఆరు ఓవర్లలో స్కోరు 42/2 మాత్రమే. భారత్ బౌలర్లు 10 ఓవర్లలోనే 37 డాట్ బాల్స్ వేశారు.
మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు పాకిస్తాన్‌ను పూర్తిగా కట్టడి చేశారు. ఫఖర్ జమాన్ (17)ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. అలాగే కెప్టెన్ సల్మాన్ అఘా (3)ను కూడా వెనక్కి పంపించాడు. కుల్దీప్ యాదవ్ మరోసారి తన బౌలింగ్ పదును చూపించాడు. మూడు వికెట్లతో అదరగొట్టాడు. అతను హసన్ నవాజ్ (5), మహ్మద్ నవాజ్ (0), ఫర్హాన్ (40) వికెట్లు తీశారు. కుల్దీప్ 4 ఓవర్లలో 18 పరుగులకే 3 వికెట్లు పడగొట్టారు. దీంతో పాకిస్తాన్ 61/4 నుండి 78/6కి పడిపోయింది.
చివరి ఐదు ఓవర్లలో షాహీన్ అఫ్రిదీ కొంత ప్రతిఘటించారు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు బాదారు. ఫహీమ్ అష్రఫ్ ఒక బౌండరీ కొట్టినా వెంటనే ఎల్బీడబ్ల్యూ అయ్యారు. బుమ్రా చివర్లో సుఫియాన్ ముకీమ్ (10) వికెట్ తీశారు. మొత్తం 20 ఓవర్లలో పాకిస్తాన్ 127/9కి పరిమితమైంది. ఫర్హాన్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
భారత్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ 3/18తో మెరిశారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. బుమ్రా, పాండ్యా తలా ఒక్కో వికెట్ సాధించారు. వరుణ్ చక్రవర్తి కూడా ఒక వికెట్ తీశారు. బౌలర్లు మొత్తం మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఒత్తిడి కొనసాగించారు. భారత్ ముందు ఇప్పుడు 128 పరుగుల లక్ష్యం ఉంది. తేమ కారణంగా డ్యూ ప్రభావం ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి.