ఆసియా కప్ లో ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై బహిరంగ వ్యాఖ్యలు చేశారు. పిసిబి షాదాబ్ మీద ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ మీద వేటు పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆసియా క్రికెట్ కప్ టోర్నమెంటులో అతను పేలవమైన ఆటను ప్రదర్శించడమే కాకుండా కెప్టెన్ బాబర్ ఆజమ్ మీద బహిరంగ వ్యాఖ్యలు చేశాడు. దీంతో షాదాబ్ ఖాన్ మీద పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. షాదాబ్ ఖాన్ ను వైస్ కెప్టెన్ పదవి నుంచి తప్పించాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరిగే పీసీబీ బోర్డు సమావేశంలో ఆ నిర్ణయం తీసుకుంటారని జియో న్యూస్ వెల్లడించింది.
మైదానంలో బాబర్ ఆజంతో ఏమంత సంతోషంగా ఉండలేకపోతున్నామని, మైదానం వెలుపల మాత్రం అతడితో బాగా ఎంజాయ్ చేస్తామని, మైదానంలో అతను పూర్తి భిన్నంగా ఉంటాడని షాదాబ్ ఖాన్ వ్యాఖ్యానించాడు. స్లార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ కూడా బాబర్ అజంకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది.
undefined
ఆసియా కప్ టోర్నమెంటు సందర్భంగా డ్రెసింగ్ రూంలో బాబర్ ఆజంకు, పేసర్ షాహిన్ షా ఆఫ్రిదీకి మధ్య వాగ్వివాదం చెలరేగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీలంకపై ఓటమి చవి చూసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో లుకలుకలు బయటపడ్డాయి. పాకిస్తాన్ జట్టులో రెండు వర్గాలున్నాయని, ఓ వర్గం బాబర్ ఆజం కెప్టెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని వార్తలు వచ్చాయి.
ఆసియా కప్ 2023 లీగ్ దశలో పాకిస్తాన్ మెరుగైన ఆటతీరునే ప్రదర్శించింది. సూపర్ -4లో మాత్రం నిరాశజనకంగా ఆడింది. శ్రీలంకపై ఓటమి తర్వాత ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది.