ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంక బ్యాటింగ్ ను తుత్తునియలు చేసి వారికి చుక్కలు చూపించిన హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ చాలా మామూలు కుటుంబం నుంచి వచ్చాడు.
హైదరాబాద్: హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ గా పిలుచుకునే మొహమ్మద్ సిరాజ్ ఆసియా కప్ ఫైనల్ లో భాగంగా శ్రీలంకపై జరిగిన మ్యాచులో బంతితో నిప్పులు చెరిగాడు. ఫైనల్ మ్యాచ్ ను కాస్తా శ్రీలంక వర్సెస్ సిరాజ్ గా మార్చేశాడు. ఒక్కే ఓవరులో నాలుగు వికెట్లు తీసి శ్రీలంక బ్యాటింగ్ ను తుత్తునియలు చేశాడు. మొత్తం ఆరు వికెట్లు తీసుకున్నాడు. అతని బౌలింగ్ దెబ్బకు శ్రీలంక 50 పరుగులకే పరిమితమైంది.
అయితే, సిరాజ్ ప్రపంచ క్రికెట్ లో అంత ఎత్తుకు ఎదగడానికి వెనక చాలా శ్రమనే ఉంది. అతి పేద కుటుంబం నుంచి వచ్చి సిరాజ్ క్రికెట్ చరిత్రలో తనకంటూ కొంత భాగాన్ని కేటాయించుకున్నాడు. తోటి ఆటగాళ్లు అతన్ని మియా భాయ్ గా పిలుచుకుంటారు. సిరాజ్ తండ్రి ఆటో డ్రైవర్. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ సిరాజ్ ఎదుగుదలకు తోడ్పాటు అందించారు.
undefined
సిడ్నీ టెస్టులోో సిరాజ్ స్థానిక ప్రేక్షకుల నుంచి జాత్యహంకార వ్యాఖ్యలను ఎదుర్కున్నాడు. అయినా కూడా తన బౌలింగ్ లో ప్రతిభ కనబరిచాడు. 2020 డిసెంబర్ లో బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో ఆడుతుండగా సిరాజ్ తండ్రి మరణించాడు. అయినప్పటికీ విషాదాన్ని దిగమింగి ఆటను కొనసాగించాడు. ఈ సిరీస్ తోనే అతను అంతర్జాతీయ టెస్టుల్లో కాలు పెట్టాడు.
మొదట్లో సిరాజ్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడు. అతనికి కోచ్ కూడా లేడు. టెన్నిస్ బాల్ తోనే బౌలింగ్ ను మెరుగుపరుచుకుంటూ వచ్చాడు. దాంతోనే మెళుకవలు నేర్చుకున్నాడు. సిరాజ్ తన కెరీర్ ను బౌలర్ గా కాకుండా బ్యాటర్ ప్రారంబించాడు. చార్మినార్ క్రికెట్ క్లబ్ తరపు బ్యాట్స్ మన్ గా మైదానంలోకి దిగేవాడు. ఆ తర్వాతనే బౌలర్ గా ముందుకు వచ్చాడు.
సిరాజ్ మొదటి సంపాదన కేవలం 500 రూపాయలు. తన మామయ్య కెప్టెన్సీలోనే అతను క్లబ్ క్రికెట్ ఆడుతూ వచ్చాడు. 25 ఓవర్ల మ్యాచులో అతను 9 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడి ప్రతిభకు మామయ్య రూ.500 ఇచ్చాడు.సిరాజ్ 2015-16 రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తరఫున ఆడాడు. అత్యధికంగా 41 వికెట్లు తీసిన బౌలర్ గా పేరు గడించాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సిరాజ్ ఐపిఎల్ వేలంలో రూ.2.6 కోట్టకు కొనుక్కుంది దాంతో ఎక్కువ మొత్తం దక్కించుకునన అన్ క్యాప్డ్ ప్లేయర్ గా నిలిచాడు. ఆ సొమ్ముతో అతను తల్లిదండ్రులకు ఇల్లు కొని ఇచ్చాడు.
ప్రస్తుతం సిరాజ్ టీమిండియాకు విలువైన ఆటగాడిగా మారాడు. సిరాజ్ కోసం మొహమ్మద్ షమీని కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్నిబట్టి సిరాజ్ ప్రతిభ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. సిరాజ్ లేకుండా భారత క్రికెట్ జట్టును ఊహించలేని పరిస్థితిని కల్పించాడు.