Asia Cup 2022 INDvsSL: మళ్లీ టాస్ ఓడిన రోహిత్ శర్మ... టీమిండియాకి చావో రేవో..

By Chinthakindhi RamuFirst Published Sep 6, 2022, 7:05 PM IST
Highlights

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక... వరుసగా మూడో మ్యాచ్‌లో టాస్ ఓడిన రోహిత్ శర్మ.. 

ఆసియా కప్ 2022 సూపర్ 4 రౌండ్‌లో భాగంగా నేడు భారత జట్టు, శ్రీలంకతో తలబడుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ శనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. సూపర్ 4 రౌండ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతుల్లో 5 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు, ఫైనల్ చేరాలంటే నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది...

ఆసియా కప్ 2022 టోర్నీలో మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో టాస్ ఓడిపోయాడు. గత 16 టీ20 మ్యాచుల్లో రోహిత్ శర్మ కేవలం నాలుగు మ్యాచుల్లో మాత్రమే టాస్ గెలిచాడు రోహిత్ శర్మ.

గ్రూప్ స్టేజీలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్తాన్ చేతుల్లో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది శ్రీలంక. ఆ మ్యాచ్‌లో 105 పరుగులకే ఆలౌట్ అయిన శ్రీలంక, ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై 183 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి... సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించింది...

ఈ మధ్యకాలంలో శ్రీలంక జట్టు పెద్దగా ఫామ్‌లో లేదు. ఈ ఏడాది ఫ్రిబవరిలో శ్రీలంకపై 3-0 తేడాతో టీ20 సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసింది భారత జట్టు. అయితే ఈ టీ20 సిరీస్‌లో టీమిండియా తరుపున టాప్ స్కోరర్లుగా నిలిచిన శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్... ఆసియా కప్ 2022 టోర్నీ ఆడడం లేదు. అలాగే రవీంద్ర జడేజా గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. 

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. సీనియర్ భువనేశ్వర్ కుమార్ డెత్ ఓవర్లలో భారీగా పరుగులు ఇవ్వగా హార్ధిక్ పాండ్యా, యజ్వేంద్ర చాహాల్ కూడా విఫలమయ్యారు. అయితే చాహాల్‌కి మరో అవకాశం ఇచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్, గత మ్యాచ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చిన యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్‌ని పక్కనబెట్టి అతని స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి తుదిజట్టులో చోటు కల్పించింది.

భారత జట్టు: కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహాల్, అర్ష్‌దీప్ సింగ్

శ్రీలంక జట్టు: పథుమ్ నిశ్శంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, ధనుష్క గుణతిలక, భనుక రాజపక్ష, దసున్ శనక, వానిందు హసరంగ, చమికా కరుణరత్నే, మహీశ్ తీక్షణ, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మదుశంక

click me!