కెఎల్ రాహుల్ మరో ఫ్లాప్, విరాట్ కోహ్లీ డకౌట్... డూ ఆర్ డై మ్యాచ్‌లో కష్టాల్లో టీమిండియా...

By Chinthakindhi RamuFirst Published Sep 6, 2022, 8:02 PM IST
Highlights

India vs Sri Lanka: 6 పరుగులు చేసి అవుటైన కెఎల్ రాహుల్... విరాట్ కోహ్లీ డకౌట్... 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత జట్టు... 

ఆసియా కప్ 2022 టోర్నీ ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు, పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లంక కెప్టెన్ దసున్ శనక, మొదటి మూడు ఓవర్లలో అనుకున్న రిజల్ట్ రాబట్టగలిగాడు. తొలి ఓవర్‌లో రెండు వైడ్లు, రెండు సింగిల్స్ రూపంలో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. రెండో ఓవర్‌లో కెఎల్ రాహుల్‌ని మహీశ్ తీక్షణ, ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ చేశాడు...

అంపైర్ అవుట్ ఇవ్వగానే డీఆర్‌ఎస్ తీసుకున్నాడు కెఎల్ రాహుల్. అయితే టీవీ రిప్లైలో అంపైర్స్ కాల్‌గా రావడంతో 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పాక్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 20 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి పర్వాలేదనిపించిన కెఎల్ రాహుల్, తన పేలవ ఫామ్‌ని మళ్లీ కొనసాగించాడు. 

వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ... దిల్షాన్ ముదుశంక బౌలింగ్‌లో మొదటి మూడు బంతుల్లో పరుగులు చేయలేకపోయాడు... నాలుగో బంతికి అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు దిల్షాన్ మదుశంక. దీంతో 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఆసియా కప్ టోర్నీలో విరాట్ కోహ్లీకి ఇది మొట్టమొదటి డకౌట్ కాగా కెరీర్‌లో 33వ డకౌట్...

భారత జట్టు తరుపున టాప్ ఆర్డర్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్ (34 సార్లు) డకౌట్ అయ్యి, విరాట్ కోహ్లీ కంటే ముందున్నాడు. శ్రీలంకపై టీ20ల్లో ఘనమైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ, గత ఆరు మ్యాచుల్లో నాలుగు హాఫ్ సెంచరీలు, రెండు సార్లు 25+ స్కోర్లు నమోదు చేశాడు... ఓవరాల్‌గా భారత జట్టు తరుపున అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా ఆరో స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ. జహీర్ ఖాన్ 44 సార్లు, ఇషాంత్ శర్మ 40 సార్లు, హర్భజన్ సింగ్ 37, అనిల్ కుంబ్లే 35, సచిన్ టెండూల్కర్ 34 సార్లు డకౌట్ అయ్యి... విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు... 

3 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 15 పరుగులు మాత్రమే చేసింది భారత జట్టు. నాలుగో ఓవర్‌లో 7 పరుగులు మాత్రమే రాగా ఐదో ఓవర్‌లో ఓ సిక్సర్, ఓ ఫోర్ బాదిన కెప్టెన్ రోహిత్ శర్మ, భారత జట్టు స్కోరును 36 పరుగులకు చేర్చాడు. ఆరో ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 44 పరుగులు చేసింది భారత జట్టు...
 

click me!