వరల్డ్ కప్ ముందుంది.. అర్థం చేసుకోండి.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ కీలక ఆదేశం..!

By Srinivas MFirst Published Jan 2, 2023, 3:54 PM IST
Highlights

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 కోసం ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.   ఇటీవలే  మినీ వేలం ముగిసిన నేపథ్యంలో జట్టు కూర్పు గురించి, ఇతర వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.  కానీ.. 

‘జాతీయ జట్టుకు ఆడమంటే గాయాలు, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అంటూ సాకులు చెప్పే బదులు రెండు నెలలు  ఐపీఎల్ ఆడటం మానేయండి..’ బడా టోర్నీలలో టీమిండియా ఓడినప్పుడు  మన క్రికెటర్లకు ఫ్యాన్స్, క్రికెట్ పండితుల నుంచి  వచ్చే సూచన ఇది. ‘ఐపీఎల్ ఆడటానికి సిద్ధమయ్యే క్రికెటర్లు.. ఆ ఆటకు అలవాటుపడి  దేశం కోసం ఆడటం మరిచిపోతున్నారు..’ అని కూడా విమర్శలు వినిపిస్తాయి.  కొద్దిరోజుల క్రితం ముగిసిన టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ లలో  కూడా భారత్ ఓడటానికి అందరి  వేళ్లూ ఐపీఎల్ నే దోషిగా చేశాయి. ఈ నేపథ్యంలో  బీసీసీఐ.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేయనున్నట్టు తెలుస్తున్నది. వన్డే ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో కఠిన చర్యలకు దిగకుంటే  స్వదేశంలో కూడా భంగపాటు తప్పదనే భావనలో బోర్డు ఉన్నట్టు తెలుస్తున్నది. 

రెండు నెలల పాటు విరామం లేకుండా  సాగే ఐపీఎల్ వల్ల  ఆటగాళ్లు అధికంగా అలిసిపోతున్నారనేది బహిరంగ వాస్తవం. ఈ ప్రభావం  ద్వైపాక్షిక సిరీస్ లు,   కీలక టోర్నీలలో స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే  వచ్చే ఐపీఎల్ నుంచి  దీనికి చెక్ పెట్టే దిశగా  బీసీసీఐ పావులు కదుపుతున్నది. భారత స్టార్ ఆటగాళ్లు  ఐపీఎల్ లో పరిమితంగా  పాలు పంచుకునేలా  ప్రణాళికలు రూపొందిస్తున్నది.

ఈ మేరకు  టీమిండియా స్టార్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర  జడేజా, సూర్యకుమార్ యాదవ్,  హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్,  దీపక్ చాహర్ ల మీద  బీసీసీఐ  ప్రత్యేక దృష్టి సారించనున్నది.  ఫిట్నెస్, గాయాల బారిన పడకుండా ఉండేందుకు గాను వీళ్ల బాధ్యతలను జాతీయ క్రికెట్ అకాడమీకి అప్పగించనున్నది.  ఎన్సీఏ.. ఐపీఎల్ ఫ్రాంచైజీలతో సమన్వయం చేసుకుంటూ సదరు ఆటగాళ్ల గురించి  ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనుంది.  

కాగా వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని  బీసీసీఐ.. ఆదివారం ఓ కోర్ గ్రూప్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.   20 మంది క్రికెటర్లతో  ఓ గ్రూప్ ను తయారుచేసి వారినే రొటేషన్ పద్ధతిలో  సిరీస్ లు ఆడించనున్నది.  ప్రపంచకప్ వరకు వారిని సన్నద్ధం చేసి  బరిలోకి దించాలన్నది బీసీసీఐ ప్రణాళికలో భాగంగా ఉంది. 

 

Here are some of the big decisions taken by the Indian cricket board in the review meeting after a poor 20-20 World Cup outing. pic.twitter.com/jAzymPWjaR

— Cricket Book (@cricketbook_)

బీసీసీఐ సూచించే ఈ కోర్ గ్రూప్ లోని ఆటగాళ్ల బాధ్యత ఎన్సీఏదే.  ఐపీఎల్ తో పాటు ఆ ఆటగాళ్ల ఫిట్నెస్, గాయాలు, వర్క్ లోడ్ తదితర విషయాల కోసం ఎన్సీఏలోని ఓ ప్రత్యేక విభాగం పర్యవేక్షించనున్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ బీసీసీఐ  ప్రణాళిక ప్రకారం  ఫ్రాంచైజీలు నడుచుకోవాలంటే.. ఐపీఎల్-2023లో టీమిండియా స్టార్ ప్లేయర్లు ఆడేది తక్కువ మ్యాచ్ లే  ఉంటాయి. ఇప్పటికే స్టేడియాలకు ప్రేక్షకులు రాక, టీవీలలో రేటింగ్ పడిపోయిన ఐపీఎల్..  స్టార్లు లేకుండా సక్సెస్ అవుతుందా..? అనేది కాలమే నిర్ణయించనున్నది. 

click me!