టార్గెట్ వన్డే వరల్డ్ కప్.. యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన బీసీసీఐ.. 20 మందితో జాబితా సిద్ధం..!

By Srinivas MFirst Published Jan 1, 2023, 5:43 PM IST
Highlights

BCCI: గతేడాది ఖాయమనుకున్న ఐసీసీ ట్రోఫీ చేజారడంతో స్వదేశంలో ఈ ఏడాది జరగాల్సి ఉన్న  వన్డే వరల్డ్ కప్ కు  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ మేరకు ముంబైలో జరిగిన  రివ్యూ మీటింగ్ లో కీలక  నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తున్నది. 

భారత క్రికెట్  జట్టు ఐసీసీ ట్రోఫీ నెగ్గి పదేండ్లు  కావొస్తున్నది.   2013లో  ధోని సారథ్యంలోని  టీమిండియా.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.  అంతకంటే ముందు  2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఈ మధ్యలో పలు  టోర్నీలు జరిగినా.. కెప్టెన్లు మారినా  ప్రతీసారి భారత్ కు నిరాశే మిగిలింది. విరాట్ కోహ్లీ వల్ల కాలేని ఐసీసీ ట్రోఫీని  తీసుకొస్తాడని  నమ్మకంతో  బీసీసీఐ.. టీమిండియా సారథ్య పగ్గాలు  రోహిత్ శర్మకు అప్పగించింది. అయినా గతేడాది ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో ఫలితం మారలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది స్వదేశంలో  జరుగబోయే వన్డే వరల్డ్ కప్ ను గెలవడమే లక్ష్యంగా  టీమిండియా అడుగులు వేస్తున్నది.  

ఇందులో భాగంగానే వన్డే వరల్డ్ కప్ లో ఆడబోయే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసినట్టు బీసీసీఐ వర్గాల సమాచారం.  క్రిక్ బజ్ నివేదిక ప్రకారం..  వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని  బీసీసీఐ 20 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను తయారుచేసింది.  ప్రపంచకప్ వరకూ ఈ 20 మంది ఆటగాళ్లే  రొటేషన్ పాలసీలో  రొటేట్ అవుతారు.  గాయాలబారిన పడ్డా,ఫిట్నెస్ సమస్యలు తలెత్తినా, ఫామ్ కోల్పోయినా  ఈ 20 మంది క్రికెటర్ల మీద బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించనున్నదని  సమాచారం.

ఈ మేరకు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్,   మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్,  బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ  జై షా, సారథి రోహిత్ శర్మలు పాల్గొన్న  రివ్యూ మీటింగ్ లో వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది.  టీమిండియా తర్వాత ఆడబోయే  మ్యాచ్ లలో ఈ 20 మందిని కచ్చితంగా భాగమయ్యేలా చూస్తూ వారిని ప్రపంచకప్ వరకు సిద్ధం చేయాలని భావిస్తున్నది. 

ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘రివ్యూ మీటింగ్ చాలా బాగా  జరిగింది. ఆటగాళ్లు, జట్టు గత ప్రదర్శనల గురించి చర్చ జరిగింది. ఈ ఏడాది వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్  వంటి కీలక టోర్నీలు ఉన్న నేపథ్యంలో  వాటికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని మేం భావిస్తున్నాం.  మధ్యలో ఐపీఎల్ రాబోతున్నా తొలి ప్రాధాన్యం మాత్రం  ఐసీసీ టోర్నీలకే. ఆటగాళ్ల అందుబాటు, ఫిట్నెస్, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ వంటి విషయాలు  చర్చలోకి వచ్చాయి.   వన్డే వరల్డ్ కప్ గురించి సుదీర్ఘ చర్చ జరిగింది..’ అని   తెలిపారు. 

 

BCCI shortlists 20 players for 2023 ICC Men's World Cup https://t.co/ogIEJyPTgL

— Harsha Bhogle (@bhogleharsha)

ఏప్రిల్ - మే లలో ఐపీఎల్ ఉన్న నేపథ్యంలో ఎంపిక చేసిన 20 మంది ఆటగాళ్ల ఫిట్నెస్,  వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కు సంబంధించిన విషయాలపై ఎన్సీఏ  దృష్టి సారించనున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగా ఎన్సీఏ.. ఐపీఎల్ ఫ్రాంచైజీలతో  సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.   ఇక ఫిట్నెస్ విషయంలో యోయో టెస్టుతో పాటు కొత్తగా  డెక్సా టెస్టును కూడా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నది.  మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 

click me!