పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఇటీవలికాలంలో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడాకులతో పాటు మూడో పెళ్లి వ్యవహారాలతో ఆయన పేరు మారుమోగుతోంది. తాజాగా మరోసారి మాలిక్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాడు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఇటీవలికాలంలో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడాకులతో పాటు మూడో పెళ్లి వ్యవహారాలతో ఆయన పేరు మారుమోగుతోంది. తాజాగా మరోసారి మాలిక్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో ఫార్చూన్ బరిషల్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సమయంలో మాలిక్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు లీగ్ మధ్యలో తప్పుకుని దుబాయ్‌కు వెళ్లిపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. దీంతో షోయబ్ మాలిక్ కాంట్రాక్ట్ రద్దు చేసే యోచనలో ఫార్చూన్ బరిషల్ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అసలేంటీ వివాదం :
బీపీఎల్‌లో ఖుల్నా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో మూడు నోబాల్స్ వేశాడు షోయబ్ . అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందేనంటూ, అతనిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆ వెంటనే ఫార్చూన్ బరిషల్ ఫ్రాంచైజీ మాలిక్‌ను తప్పించిందని, అందుకే అతను దుబాయ్ వెళ్లిపోయాడనే కథనాలు వెల్లువెత్తాయి. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను షోయబ్ మాలిక్ కొట్టిపడేశాడు. ఫార్చూన్ బరిషల్ జట్టుతో తెగతెంపులు చేసుకున్నట్లుగా వస్తున్నవన్నీ కట్టుకథలేనని పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై మా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌తో చర్చించానని, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకే దుబాయ్ వెళ్లాల్సి వచ్చిందని మాలిక్ వెల్లడించాడు. జట్టుకు అందుబాటులోనే వుంటానని షోయబ్ మాలిక్ పేర్కొన్నాడు.
ఇకపోతే.. భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. వారిద్దరూ విడాకులు తీసుకున్నారని షోయబ్ మాలిక్ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ చేసిన ఫొటోల్లో తేలిపోయింది. అయితే ఈ విడాకులను సానియా మీర్జా కుటుంబం నిర్ధారించింది. సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా తన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ద్వారా విడాకులను ధ్రువీకరించారు.
‘‘ సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజలకు దూరంగా ఉంచుతుంది. షోయబ్, ఆమె విడాకులు తీసుకుని కొన్ని నెలలు అవుతోంది. అయతే ఈ విషయాన్ని ఆమె ఈ రోజు షేర్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. షోయబ్ కొత్త ప్రయాణానికి ఆమె శుభాకాంక్షలు తెలిపింది!’’ అని మీర్జా కుటుంబంలో ఆ పోస్ట్ ద్వారా ప్రకటించింది.