
టీ20 క్రికెట్‌లో వన్ ఆఫ్ ది టాప్ టీమ్‌గా చెప్పుకునే పాకిస్తాన్, పసికూన ఆఫ్ఘాన్ చేతుల్లో వరుసగా రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడింది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో జింబాబ్వే చేతుల్లో ఓడినా.. అదృష్టం కలిసి రావడంతో ఫైనల్ దాకా వెళ్లిన పాకిస్తాన్... ఆఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌ని కోల్పోయి, చెత్త రికార్డును మూటకట్టుకుంది...
తొలి టీ20లో పాక్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచిన ఆఫ్ఘాన్, రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. పసికూనలతో సిరీస్ అనే ఉద్దేశంతో బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ ఆఫ్రిదీ, హారీస్ రౌఫ్ వంటి స్టార్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చిన పాకిస్తాన్, భారీ మూల్యమే చెల్లించుకుంది.
సీనియర్లు లేకుండా బీ టీమ్‌తో ఆడి సిరీస్‌లు గెలిచేందుకు టీమిండియాలా పాకిస్తాన్‌కి రిజర్వు బెంచ్‌లో టాప్ క్లాస్ ప్లేయర్లు లేరని మరోసారి ప్రపంచానికి నిరూపితం చేసింది.. రెండో టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 130 పరుగులకి పరిమితమైంది.
సయిం అయూబ్ డకౌట్ కాగా మహ్మద్ హారిస్ 9 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సఫిక్ డకౌట్ కాగా తయ్యబ్ తాహీర్ 23 బంతుల్లో 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఆజమ్ ఖాన్ 1 పరుగు చేయగా ఇమాద్ వసీం 57 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాక్ కెప్టెన్ షాదబ్ ఖాన్ 25 బంతుల్లో 3 ఫోర్లతో 32 పరుగులు చేశాడు..
ఈ లక్ష్యాన్ని ఆఫ్ఘాన్ 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. రహ్మనుల్లా గుర్బాజ్ 49 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేయగా ఉస్మాన్ ఘనీ 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇబ్రహీం జార్డన్ 40 బంతుల్లో 3 ఫోర్లతో 38 పరుగులు చేయగా నజీబుల్లా జార్డన్ 12 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేశాడు. మహ్మద్ నబీ 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేశాడు..
4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన ఆఫ్ఘాన్ బౌలర్ ఫజల్ హక్ ఫరూకీ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. పాకిస్తాన్, ఆఫ్ఘాన్ మధ్య నేడు ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇది కూడా ఓడితే ఆఫ్ఘానిస్తాన్ చేతుల్లో క్లీన్ స్వీప్ అవుతుంది పాకిస్తాన్..
ఈ టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఆప్ఘాన్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్‌తో పాటు ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆప్ఘాన్ ప్లేయర్లు, ఐపీఎల్ కోసం ఇండియాకి రాబోతున్నారు.