తొలి డబ్ల్యూపీఎల్ విజేత ముంబై.. పోరాడి ఓడిన ఢిల్లీ..

By Srinivas MFirst Published Mar 26, 2023, 10:49 PM IST
Highlights

WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్ సంచలన విజయం సాధించింది.   చివరి ఓవర్ వరకూ నువ్వా నేనా అంటూ సాగిన మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లు కట్డడి చేసినా ముంబై పోరాడి విజయం సాధించింది. 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ తొలి సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది.  ఏకపక్షంగా సాగుతుందేమో అనుకున్న అభిమానులకు ఇరు జట్లూ కావాల్సిన ముగింపునిచ్చాయి.  రొడ్డకొట్టుడు  భారీ స్కోర్ల మ్యాచ్ ల వలే కాకుండా లో స్కోరింగ్ గేమ్ లో  కావాల్సినంత ఉత్కంఠను పంచుతూ  విజయం చివరివరకూ ఇరు జట్ల మధ్య దోబూచూలాడింది.  ఢిల్లీ నిర్దేశించిన  132 పరుగుల లక్ష్య ఛేదనలో  ముంబై.. విజయం కోసం చివరి  ఓవర్ వరకూ పోరాడింది.  ముంబై  ఆల్ రౌండర్  సీవర్ (55 బంతుల్లో 60 నాటౌట్, 7 ఫోర్లు)  క్లాసిక్ ఇన్నింగ్స్ కు తోడు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్  (39 బంతుల్లో  37, 5 ఫోర్లు) నిలకడైన ఆటతో  132 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19. ఓవర్లలో  మూడు వికెట్లు నష్టపోయి మరో  3 బంతులు మిగిలుండగా అందుకుంది. దీంతో బీసీసీఐ నిర్వహించిన తొలి డబ్ల్యూపీఎల్ ట్రోఫీని  గెలుచుకున్న తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర పుటల్లోకెక్కింది. 

ఛేదించాల్సిన లక్ష్యం తక్కువే ఉన్నా ముంబైకి ఢిల్లీ బౌలర్లు  చుక్కలు చూపించారు.  తొలి ఓవర్లో మాథ్యూస్  (13) రెండు ఫోర్లు కొట్టింది. రెండో ఓవర్లో యస్తికా  (4) ఓ ఫోర్ కొట్టినా   మరుసటి బంతికే నిష్క్రమించింది. ఫుల్ టాస్ బాల్ ను భారీ షాట్ ఆడిన యస్తికా.. క్యాప్సీకి క్యాచ్ ఇచ్చింది. 

నిదానమే  ప్రధానం.. 

నాలుగో ఓవర్ వేసిన జొనాసేన్.. మాథ్యూస్ ను పెవిలియన్ పంపింది.  వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో   ముంబై స్కోరు వేగం తగ్గింది. అనవసరంగా షాట్లకు పోయి  వికెట్లు కోల్పోవడం ఎందుకని భావించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్  ( ), నటాలీ సీవర్  ( ) లు  నిదానంగా ఆడారు.  వీరిద్దరూ క్రీజులో ఉన్నా ఐదో ఓవర్లో 2 పరుగులు రాగా.. ఆరు, ఏడు ఓవర్లలో ఒక్కొక్క పరుగే వచ్చింది. తర్వాత కూడా ముంబై ఇన్నింగ్స్ నెమ్మదిగానే సాగింది.   పదో ఓవర్ వేసిన క్యాప్సీ బౌలింగ్ లో   తొలి బంతికి ఫోర్ కొట్టిన   కౌర్.. రెండో బంతికి సింగిల్ తీయడంతో  ఆ జట్టు స్కోరు 50 పరుగులు దాటింది.   ఆ తర్వాత రాదా యాదవ్ వేసిన   11వ ఓవర్లో కూడా  నాలుగు పరుగులు వచ్చాయి.  

గేర్ మార్చారు.. 

వికెట్లు కాపాడుకున్న  సీవర్,  కౌర్ లు  సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతుండటంతో గేర్ మార్చారు.  క్యాప్సీ వేసిన   12వ ఓవర్లో   ఇద్దరూ తలా ఓ ఫోర్ కొట్టారు.   జొనాసేన్ బౌలింగ్ లో కూడా కౌర్.. బౌండరీ సాధించింది. రాధా యాదవ్ వేసిన  15వ ఓవర్లో   తొలి బంతికి  కౌర్ ఫోర్ కొట్టింది. శిఖా పాండే వేసిన   16వ ఓవర్లో    సీవర్ కూడా బంతిని బౌండరీకి తరలించింది.  

 

𝗣𝗥𝗘𝗦𝗘𝗡𝗧𝗜𝗡𝗚 𝗧𝗛𝗘 𝗠𝗔𝗜𝗗𝗘𝗡 𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡𝗦 𝗢𝗙 !

CONGRATULATIONS 👏👏 | | pic.twitter.com/2NqPLqk9gW

— Women's Premier League (WPL) (@wplt20)

అలీస్ క్యాప్సీ వేసిన    17వ ఓవర్లో   తొలి బంతికే  హర్మన్ రనౌట్ అయింది.  కానీ అదే ఓవర్లో  సీవర్ రెండు ఫోర్లు కొట్టింది.   కానీ శిఖా పాండే వేసిన 18వ ఓవర్లో ఐదు పరుగులే వచ్చాయి.  చివరి రెండు ఓవర్లలో   ముంబై విజయానికి  21 పరుగులు కావాల్సి ఉండగా  ఆ ఓవర్లో కెర్ (14 నాటౌట్)   రెండు బౌండరీలు బాదింది. ఈ ఓవర్లో 16 పరుగులొచ్చాయి. చివరి ఓవర్లో  సీవర్ బౌండరీ బాదాక  ముంబై విజయం ఖాయమైంది. 

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నీర్ణీత  20 ఓవర్లలో   9 వికెట్ల నష్టానికి  131 పరుగులే చేసింది.   ఆ జట్టులో  కెప్టెన్ మెగ్ లానింగ్ (35) తో పాటు ఆఖర్లో   శిఖా పాండే (27 నాటౌట్), రాధా యాదవ్  (27 నాటౌట్)   లు రాణించారు. ముంబై బౌలర్లలో వాంగ్, హేలీ మాథ్యూస్ లు తలా మూడు వికెట్లు తీశారు. 
 

click me!