కరోనాను పట్టించుకోని పాకిస్తానీయులు: మూర్ఖులుగా నిలిచిపోవద్దన్న ఇమ్రాన్

By Siva KodatiFirst Published Apr 5, 2020, 10:35 PM IST
Highlights

ప్రపంచం మొత్తం కరోనాను అల్లాడుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఆయా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే ప్రభుత్వాధినేతల పిలుపుకు ప్రజలు  సహకరిస్తున్నారు. అయితే మన దాయాది దేశం పాకిస్తాన్‌లో మాత్రం ప్రజలు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారు

ప్రపంచం మొత్తం కరోనాను అల్లాడుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఆయా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే ప్రభుత్వాధినేతల పిలుపుకు ప్రజలు  సహకరిస్తున్నారు.

అయితే మన దాయాది దేశం పాకిస్తాన్‌లో మాత్రం ప్రజలు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

శనివారం లాహోర్‌లో కరోనాపై పోరాటంలో భాగంగా ఆయన ‘‘ కరోనా రిలీఫ్ ఫండ్‌’’ను ప్రారంభించి, అనంతరం ఇమ్రాన్ మాట్లాడారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని  ఆయన విజ్ఞప్తి చేశారు.

Also Read:పాక్ ని మోసం చేసిన చైనా, లో దుస్తులతో చేసిన మాస్కులను పంపిన వైనం, వీడియో వైరల్

క్లిష్ట పరిస్ధితులు చుట్టుముడుతున్న సమయంలో మూర్ఖులుగా ప్రవర్తించకండి అంటూ ఇమ్రాన్ హితవు పలికారు. కరోనా నియంత్రణ పాటించని వారిని ఎవరినీ వదిలిపెట్టదని ఆయన హెచ్చరించారు.

అల్లా పాక్ ప్రజలకు కరోనా మహమ్మారి రాకుండా చేశారనే ప్రచారం సాగుతోంది. ఇలాంటి వాటిని దయచేసి నమ్మకండి. ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

పాక్ ప్రజలకు రోగ నిరోధక శక్తి ఎక్కువని, దీంతో కరోనా రాదని, వచ్చినా ఏం కాదనే భావన కూడా సరైనది కాదని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఎంతోమంది ధనికులున్న న్యూయార్క్ సిటి పరిస్ధితిని ఓ సారి గమనించాలని ప్రధాని సూచించారు.

కరోనా వైరస్ రూపంలో మనకొక పెద్ద ఛాలెంజ్ ఎదురైందని.. ఈ సవాల్‌‌ను సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాదిద్దామని ఇమ్రాన్ కోరారు. ఇంతటి విపత్కర సమయంలో మూర్ఖులుగా ప్రవర్తించి చరిత్రలో నిలిచిపోవద్దని పాకిస్తాన్ ప్రజలకు ఇమ్రాన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు.

అనంతరం దేశంలోనే అత్యంత వేగంగా కరోనా వ్యాపిస్తున్న పంజాబ్ ప్రావిన్స్‌లో ఆయన పర్యటించారు. అక్కడ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి చేపట్టిన చర్యలను, కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిని పర్యవేక్షించారు.

Also Read:నేను మాస్క్ పెట్టుకోను, మీరైతే ధరించండి: ట్రంప్ పిలుపు

అయితే కోవిడ్ 19 చాపకింద నీరులా విస్తరిస్తున్నప్పటికీ పాక్‌లో ఇప్పటి వరకు సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించకపోవడం పట్ల ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.

విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లను మాత్రమే పాకిస్తాన్ ప్రభుత్వం మూసివేయించింది. ప్రజా రవాణా, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు వెసులుబాటు కల్పించింది. పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు 2,818 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 41 మంది మరణించారు. 

click me!